యూఏఈతో భారత్ కీలక ఒప్పందం: ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్

by samatah |
యూఏఈతో భారత్ కీలక ఒప్పందం: ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
X

దిశ, నేషనల్ బ్యూరో: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌(యూఏఈ)తో పెట్టుబడి ఒప్పందానికి కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది.‘భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం మధ్య ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది’ అని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇది తయారీ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో సహా అనేక రంగాల్లో ద్వైపాక్షిక ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంచే అవకాశం ఉందని వెల్లడించింది. ‘ఈ అగ్రిమెంట్ దేశంలో పెట్టుబడులను పెంచడం, దేశీయ తయారీని ప్రోత్సహించడం..మొదలైన వాటి ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడే అవకాశం ఉంది’ అని పేర్కొంది. అలాగే పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మెరుగుపరుస్తుందని, ఫలితంగా విదేశీ పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అవకాశాలు మెరుగవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అంతేగాక ఉపాధి కల్పనపై సానుకూల ప్రభావం చూపుతుందని తెలిపింది. కాగా, ఈ నెలలో ప్రధాని మోడీ యూఏఈలో పర్యటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ అగ్రిమెంట్‌కు ఆమోదం లభించడం గమనార్హం.

Advertisement

Next Story