ఇరాన్ నౌకను రక్షించిన ఇండియన్ నేవీ: 23 మంది పాకిస్థానీయులు సేఫ్

by samatah |
ఇరాన్ నౌకను రక్షించిన ఇండియన్ నేవీ: 23 మంది పాకిస్థానీయులు సేఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియన్ నేవీ మరోసారి సత్తా చాటింది. అరేబియా సముద్రంలో సముద్రపు దొంగల నుంచి 23మంది పాకిస్థానీయులను రక్షించింది. ఈ మేరకు ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఈ నెల 28న అరేబియా సముద్రంలో ఇరాన్‌కు చెందిన పిషింగ్ ‘ఓడ ఆల్ కంబార్‌’పై సముద్రపు దొంగలు దాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఇండియన్ నేవీ రంగంలోకి దిగింది. మొదటగా భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమేధ సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. దొంగలు హైజాక్ చేసిన ఓడను అడ్డగించింది. అనంతరం ఐఎన్ఎస్ త్రిశూల్‌ను కూడా రంగంలోని దింపి సుమారు 12గంటల పాటు ఆపరేషన్ చేపట్టి దొంగల నుంచి ఓడను సేఫ్ చేసింది. ఓడలో ఉన్న 9మంది సముద్రపు దొంగలను అదుపులోకి తీసుకుంది. యెమెన్ ద్వీపం - సోకోట్రాకు నైరుతి దిశలో సుమారు 90 నాటికల్ మైళ్ల దూరంలో ఈ నౌక ఉన్నట్టు భారత్ నౌకాదళం తెలిపింది.

అంతకుముందు గతేడాది డిసెంబరు 14న గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో హైజాక్‌కు గురైన ఎంవీ రుయెన్ అనే నౌకను భారత్ నావికాదళం రక్షించింది. సుమారు 40 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించి 35 మంది సముద్రపు దొంగలను లొంగిపోయేలా చేసింది. అందులోని 17 మంది సిబ్బందిని రక్షించింది. ఈ ఆపరేషన్‌లో ఐఎన్ఎస్ సుభద్ర, ఆధునిక డ్రోన్లు, పీ8I పెట్రోలింగ్ విమానాలను ఉపయోగించారు. ఇదే గాక అనేక ఆపరేషన్లు చేపట్టి వాణిజ్య నౌకలను కూడా రక్షించింది. కాగా, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు పెరిగాయి. దీనిని అధిగమించేందుకు భారత నౌకాదళం అరేబియా సముద్రంలో యుద్ధ నౌకలను మోహరించింది.

Advertisement

Next Story