ప్రపంచ శాంతి కోసం ఏం చేయడానికైనా సిద్ధం : ప్రధాని మోడీ

by Vinod kumar |
ప్రపంచ శాంతి కోసం ఏం చేయడానికైనా సిద్ధం : ప్రధాని మోడీ
X

ప్యారిస్ (ఫ్రాన్స్) : ఫ్రాన్స్‌ రాజధాని ప్యారిస్ గగన వీధిపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన నాలుగు రాఫెల్ యుద్ధ విమానాలు, రెండు సీ-17 గ్లోబ్ మాస్టర్లు జెట్స్ కనువిందు చేశాయి. ఫ్రాన్స్‌కు చెందిన యుద్ధ విమానాలతో జట్టు కట్టి అవి చేసిన విన్యాసాలు వహ్వా అనిపించాయి. శుక్రవారం ఉదయం జరిగిన ఫ్రాన్స్ జాతీయ దినోత్సవాలు (బాస్టిల్ డే పరేడ్‌) వేదికగా ఈ దృశ్యాలు ఆవిష్కృతం అయ్యాయి. యూరప్‌లోనే అతిపెద్ద సైనిక కవాతుగా పేరొందిన బాస్టిల్ డే పరేడ్‌‌కు గౌరవ అతిథిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో పాటు మోడీకి ఆ దేశ ఆర్మీ గౌరవ వందనం సమర్పించింది. ఈ పరేడ్‌లో భారత త్రివిధ దళాలకు చెందిన 269 మంది సైనికులు పాల్గొనడం విశేషం.

"ప్రపంచ చరిత్రలో భారత్ ఒక దిగ్గజం. భవిష్యత్తులో మాతో కలిసి భారత్ నిర్ణయాత్మక పాత్ర పోషించాలి.. భారత్ మా వ్యూహాత్మక భాగస్వామి.. జూలై 14 పరేడ్‌లో గౌరవ అతిథిగా భారతదేశాన్ని స్వాగతిస్తున్నందుకు మేం గర్విస్తున్నాం" అని ఈ కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ ట్వీట్ చేశారు. ఫ్రాన్స్ సైనికులతో కలిసి భారత సైనికులు మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న విషయాన్ని ఈ పరేడ్ సందర్భంగా మోడీకి మాక్రాన్‌ గుర్తు చేశారు. దీనిపై స్పందించిన ప్రధాని మోడీ.. "భారతదేశం శతాబ్దాల నాటి తత్వంతో ప్రేరణ పొందింది.. ప్రపంచ శాంతి కోసం ఏం చేయడానికైనా భారత్ సిద్ధంగా ఉంది. బలమైన, విశ్వసనీయ భాగస్వామిగా ఉన్నందుకు 140 కోట్ల మంది భారతీయులు ఫ్రాన్స్‌కు ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉంటారు. ఈ బంధం మరింత బలపడుతుంది" అని ట్వీట్ చేశారు.

మోడీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం..

భారత కాలమానం ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున ప్యారిస్‌లోని ఎలీసీ ప్యాలెస్‌లో భారత ప్రధాని మోడీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం “గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్‌”ను అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అందించారు. దీంతో ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారత ప్రధానిగా మోడీ గుర్తింపు పొందారు.ఈవిధంగా గౌరవించినందుకు భారత ప్రజల తరఫున ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు ప్రదానోత్సవం అనంతరం మోడీకి మాక్రాన్ ప్రైవేట్ విందు ఇచ్చారు. ప్యారిస్‌లోని లా సీన్ మ్యూజికేల్‌ ఆడిటోరియంలో ప్రవాస భారతీయులతో జరిగిన మీటింగ్‌లో మోడీ కీలక ప్రకటన చేశారు. “త్వరలోనే ఫ్రాన్స్ అంతటా యూపీఐ పేమెంట్స్‌ను అంగీకరిస్తారు.. ఈ ప్రక్రియ ప్యారిస్ సిటీలోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ నుంచి మొదలవుతుంది. దాన్ని చూసేందుకు వెళ్లే ఇండియన్ టూరిస్టులు ఈజీగా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు” అని ఆయన వెల్లడించారు.

''ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ టీమ్ కెప్టెన్‌ కైలియన్‌ ఎంబాపె కు భారత్‌లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. విదేశీ ఆటగాళ్లపై భారత్‌లో రోజురోజుకు అభిమానం పెరుగుతోంది" అని మోడీ కామెంట్ చేశారు. కాగా, ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ శుక్రవారం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో వరదల పరిస్థితిపై ఆరా తీశారు. రాబోయే 24 గంటల్లో యమునా నదిలో నీటిమట్టం తగ్గుతుందని భావిస్తున్నట్లు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌తో కలిసి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని ప్రధానికి అమిత్ షా చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed