స్పీకర్ పదవికి పోటీ చేస్తే టీడీపీకి ‘ఇండియా’ మద్దతు: సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు

by vinod kumar |
స్పీకర్ పదవికి పోటీ చేస్తే టీడీపీకి ‘ఇండియా’ మద్దతు: సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్డీయే మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థిని నిలబెడితే ఇండియా కూటమిలోని భాగస్వామ్యపక్షాలన్నీ ఆ పార్టీకి మద్దతిచ్చేలా చూస్తామని శివసేన (యూబీటీ) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఆదివారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత సందర్భంలో లోక్‌సభ స్పీకర్ పదవి చాలా కీలకమని తెలిపారు. బీజేపీకి ఆ పదవి లభిస్తే అది టీడీపీ, జేడీయూ వంటి ప్రభుత్వ మద్దతు గల పార్టీలను, చిరాగ్ పాశ్వాన్, జయంత్ చౌదరిల రాజకీయ పార్టీలను విచ్ఛిన్నం చేస్తుందని ఆరోపించారు. తమకు మద్దతిచ్చే ప్రజలకు బీజేపీ ద్రోహం చేస్తోందని, ఇటువంటి అనుభవం గతంలో శివసేనకు ఎదురైందని చెప్పారు.

‘టీడీపీ తన అభ్యర్థిని నిలబెట్టాలని అనుకుంటున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. అలా జరిగితే ఇండియా కూటమి ఈ అంశంపై చర్చించి టీడీపీకి మద్దతు ఇచ్చేలా చూస్తాం’ అని చెప్పారు. నిబంధనల ప్రకారం విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కాలన్నారు. ఎన్డీయే ప్రభుత్వం సుస్థిర పాలన కొనసాగించలేదని జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) నేతలు ఇటీవల చేసిన ప్రకటనల గురించి అడిగిన ప్రశ్నకు రౌత్ స్పందిస్తూ..ఆర్‌ఎస్‌ఎస్ గతంలోని తప్పులను సరిదిద్దాలనుకుంటే మంచిదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నింటినీ గమనిస్తున్నామని తెలిపారు.

కాగా, ఇటీవల కేంద్ర కేబినెట్ ఏర్పాటైన విషయం తెలిసిందే. మంత్రి మండలి నియామకమైనప్పటికీ స్పీకర్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. ఎన్డీయే మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూలు ఈ పదవి తమకే కావాలని పట్టుబడుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. అయితే బీజేపీ సైతం ఈ పదవిని వదులుకునేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed