దేశ జనాభాలో 5 శాతంలోపే పేదలు : నీతి ఆయోగ్

by Hajipasha |
దేశ జనాభాలో 5 శాతంలోపే పేదలు : నీతి ఆయోగ్
X

దిశ, నేషనల్ బ్యూరో : భారతదేశ ఆర్థిక స్థితి చాలా మెరుగుపడిందని, జనాభాలో ప్రస్తుతం 5 శాతం కంటే తక్కువ మందే పేదరికంలో ఉన్నారని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. దేశ ప్రజల తలసరి గృహ వినియోగ వ్యయం కూడా గణనీయంగా పెరిగిందని నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) నిర్వహించిన తాజా సర్వేలో తేలిందని ఆయన గుర్తు చేశారు. పేదరిక నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే ఈమేరకు సానుకూల ఫలితాలు వచ్చాయని నీతి ఆయోగ్ సీఈఓ చెప్పారు. ఆదాయం, కొనుగోలు శక్తి తక్కువగా ఉన్నవారి సంఖ్య 0 నుంచి 5 శాతంలోపే ఉండటం అనేది ఆర్థిక వ్యవస్థ పురోగతిని అద్దంపట్టే శుభ సంకేతమన్నారు. ‘‘దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన ప్రజల కొనుగోలు శక్తి, వ్యయ స్థాయులు 2.5 రెట్లు పెరిగాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల జీవన స్థితిగతుల్లో తగ్గుతున్న అంతరాన్ని తాజా సర్వే నివేదిక బయటపెట్టింది. ప్రాంతాలకు అతీతంగా ఆర్థిక సమానత్వం సాధించే దిశగా భారతదేశం అడుగులు పడుతున్న తీరును ప్రతిబింబించింది’’ అని బీవీఆర్ సుబ్రహ్మణ్యం వివరించారు.

Advertisement

Next Story

Most Viewed