2060 నాటికి 170 కోట్లకు భారతదేశ జనాభా: ఐక్యరాజ్యసమితి

by Harish |   ( Updated:2024-07-12 07:43:46.0  )
2060 నాటికి 170 కోట్లకు భారతదేశ జనాభా: ఐక్యరాజ్యసమితి
X

దిశ, నేషనల్ బ్యూరో: భారతదేశ జనాభా 2060 నాటికి 170 కోట్లకు పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి ఇటీవల విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. ఆ తర్వాత జనాభా తగ్గడం ప్రారంభం అవుతుందని, దాదాపు 12 శాతం క్షీణతగా ఉంటుందని తెలిపింది. ప్రపంచ జనాభా ప్రాస్పెక్ట్స్ 2024 నివేదిక, ప్రకారం, ఈ శతాబ్దంలో భారత్ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంటుంది. గత ఏడాది ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను అధిగమించిన భారత్, 2100 నాటికి ఆ స్థానాన్ని కొనసాగిస్తుందని, భూమిపై అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంటుందని నివేదిక అంచనా వేసింది.

2024లో భారతదేశ జనాభా 145 కోట్లుగా నివేదిక పేర్కొంది. ఇది 2054 నాటికి గరిష్టంగా 169 కోట్లకు పెరుగుతుందని అంచనా. తిరిగి 2100 చివరి నాటికి 150 కోట్లకు తగ్గుతుందని తెలిపింది. ప్రస్తుతం 2024లో 141 కోట్లుగా ఉన్న చైనా జనాభా 2054 నాటికి 121 కోట్లకు తగ్గుతుందని, 2100 నాటికి 633 మిలియన్లకు తగ్గుతుందని నివేదిక పేర్కొంది. తక్కువ స్థాయి సంతానోత్పత్తి కారణంగా, చైనాలో జనాభా తగ్గుదల ఎక్కువగా నమోదవుతుంది. ఈ క్షీణతతో 2100 నాటికి, చైనా మరింత నష్టపోయే అవకాశం ఉందని జనాభా విభాగం డైరెక్టర్ జాన్ విల్మోత్ అన్నారు.

అదే ప్రపంచ జనాభా విషయానికి వస్తే, రాబోయే 50-60 సంవత్సరాలలో ఇది మరింత ఎక్కువ అవుతుందని నివేదిక పేర్కొంది. 2024లో 820 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా 2080 నాటికి 1000 కోట్లకు పైగా ఉంటుందని ఆ తరువాత ప్రపంచ జనాభా క్రమక్రమంగా క్షీణించడం ప్రారంభమవుతుందని ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా ప్రాస్పెక్ట్స్ డేటా వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed