భారత్-మాల్దీవులు వివాదం: స్పందించిన విదేశాంగ శాఖ

by samatah |
భారత్-మాల్దీవులు వివాదం: స్పందించిన విదేశాంగ శాఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత ప్రధాని నరేంద్ర మోడీపై సోషల్‌మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టినందుకు గానూ ముగ్గురు డిప్యూటీ మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం ఆదివారం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఈ మేరకు భారత్‌లోని మాల్దీవుల రాయబారి ఇబ్రహీం షాహిబ్‌ను వివరణ కోరింది. దీంతో ఆయన విదేశాంగ శాఖ అధికారులతో భేటీ అయినట్టు తెలుస్తోంది. ఈ మీటింగ్‌లో మోడీపై చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరోవైపు మాలేలోని భారత హైకమిషన్ కార్యాలయం మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖతో ఈ విషయాన్ని లేవనెత్తినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. కాగా, మాల్దీవులు మంత్రులు మల్షా షరీఫ్, మరియం షియునా, అబ్దుల్లా మహ్జూమ్ మాజిద్‌లు మోడీ లక్షద్వీప్ పర్యటనను ఉద్దేశిస్తూ..‘మాల్దీవులకు ప్రత్యామ్నాయ పర్యాటక కేంద్రంగా లక్ష్యద్వీప్‌ను ప్రదర్శించే ప్రయత్నం చేశారు’ అని పోస్టు చేశారు. దీనిపై తీవ్ర దుమారం రేగగా ఈ ముగ్గురినీ మాల్దీవులు ప్రభుత్వం బాధ్యతల నుంచి తొలగించింది. మరోవైపు ఈ వివాదం కొనసాగుతుండగానే మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ నుయిజ్జు చైనా పర్యటనకు వెళ్లడం గమనార్హం.

Advertisement

Next Story