India-China border: చైనా బార్డర్‌లో ఐదారు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు..

by Vinod kumar |
India-China border: చైనా బార్డర్‌లో ఐదారు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు..
X

న్యూఢిల్లీ : చైనా తీరు వల్ల బార్డర్‌లో దాదాపు ఐదారు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ అన్నారు. ఈ సరిహద్దు ఘర్షణల పరిష్కారానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. చైనాతో గత మూడేళ్లుగా చర్చలు జరిపి వాస్తవాధీన రేఖ వెంబడి చాలాచోట్ల పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావడంలో పురోగతి సాధించామని చెప్పారు. చైనాతో సరిహద్దు వివాదం విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను జైశంకర్‌ ఖండించారు. ఈ వివాదంలో సంక్లిష్టతలు ఉన్నాయని.. వాటికి పరిష్కార మార్గాలను కనుగొనడంపై చైనా, భారత్‌లు పనిచేస్తున్నాయని తెలిపారు.

"చైనాతో సరిహద్దు వివాదం విషయంలో భారత్‌ ఏమీ చేయలేదని.. చర్చలు విజయవంతం కావన్న విమర్శలు వినిపించాయి. కానీ మూడేళ్లలో కొన్ని చోట్ల వివాద పరిష్కారాలు సాధించాం. అయితే ఇప్పటికీ అయిదారు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ కూడా చర్చల్లో పురోగతి సాధిస్తున్నాం" అని జైశంకర్‌ వివరించారు. చైనా బార్డర్‌లో రోడ్లు, వంతెనల అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ.. భారత బలగాలను త్వరితగతిన అక్కడ మోహరించేందుకు, డ్రాగన్ ఆర్మీని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇప్పుడు అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్‌లతో ఇండియాకు రవాణా వసతి మునుపటి కంటే ఇప్పుడు బెటర్ అయిందన్నారు. కాగా, 2020లో తూర్పు లద్ధాఖ్‌లో ‘గల్వాన్‌ ఘర్షణ’ కారణంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

Advertisement

Next Story

Most Viewed