నిర్మల బడ్జెట్‌లో ‘రామమందిరం’ ప్రస్తావన.. ఎందుకో తెలుసా ?

by Hajipasha |   ( Updated:2024-02-01 16:00:01.0  )
నిర్మల బడ్జెట్‌లో ‘రామమందిరం’ ప్రస్తావన.. ఎందుకో తెలుసా ?
X

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్ ప్రసంగంలోనూ అయోధ్య రామమందిరం ప్రస్తావన వచ్చింది. జనవరి 22న రామ మందిరంలో భగవాన్ శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన కొన్ని గంటల్లోనే ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పథకాన్ని ప్రధాని ప్రకటించారు. ‘‘ప్రపంచంలోని భక్తులంతా సూర్యవంశీ శ్రీరాముడి కాంతి నుంచి శక్తిని పొందుతారు’’ అనే బోధన నుంచి స్ఫూర్తిని పొంది ఈ స్కీమ్‌ను అనౌన్స్ చేశానని అప్పట్లో మోడీ తెలిపారు. ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పథకానికి సంబంధించిన పనులను త్వరలోనే వేగవంతం చేస్తామన్నారు. ఇప్పుడు అందుకు అనుగుణంగానే నిర్మలా సీతారామన్‌ తన ప్రసంగంలో ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’‌పై అనౌన్స్‌మెంట్ చేశారు. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం రోజున ప్రధానమంత్రి తీసుకున్న సంకల్పానికి అనుగుణంగా ఈ స్కీంను అమల్లోకి తెచ్చామన్నారు. ‘‘రూఫ్‌టాప్ సోలారైజేషన్ ద్వారా ఒక కోటి ఇళ్లు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పొందగలుగుతాయి. ఈ పథకం వల్ల కుటుంబాలకు డబ్బు ఆదాతో పాటు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. అదనంగా ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్‌‌ను విక్రయించే అవకాశం సైతం ఉంటుంది. ఇలా విద్యుత్‌ను విద్యుత్ పంపిణీ సంస్థలకు విక్రయించడం ద్వారా కుటుంబాలు సంవత్సరానికి రూ.15వేల నుంచి రూ.18వేల వరకు ఆదా చేసుకోవచ్చు’’ అని ఆర్థికమంత్రి నిర్మల వివరించారు.

Advertisement

Next Story