ఆన్‌లైన్ కంటెంట్‌పై సెన్సార్‌షిప్ అవసరం లేదు

by John Kora |
ఆన్‌లైన్ కంటెంట్‌పై సెన్సార్‌షిప్ అవసరం లేదు
X

- నియంత్రణా యంత్రాంగానికి ఓకే చెప్పిన సుప్రీం

- భావ ప్రకటనా స్వేచ్ఛకు లోబడి ఉండాలని సూచన

- అల్లాహ్‌బదియా కేసులో కీలక ఆదేశాలు

దిశ, నేషనల్ బ్యూరో: ఆన్‌లైన్ కంటెంట్ సెన్సార్‌షిప్‌కు దారి తీసేలా నియంత్రణ అక్కర లేదు. కానీ ఆ కంటెంట్‌‌పై నియంత్రణ ఉండేలా చూసే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రం తాము సుముఖంగా ఉన్నామని సుప్రీంకోర్టు చెప్పింది. పాడ్‌కాస్టర్ రన్వీర్ అల్లాహ్‌బదియా అసభ్యకరమైన కామెంట్లకు సంబంధించిన కేసు సోమవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆన్‌లైన్ కంటెంట్ ప్రసారం చేసే ప్లాట్‌ఫామ్స్ అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండాల్సిన అవసరం లేదని కూడా చెప్పింది. సోషల్ మీడియా కంటెంట్‌కు సంబంధించిన నియంత్రణా యంత్రాంగం ఏర్పాటుకు ఒక ముసాయిదాను రూపొందించాలని, స్టేక్ హోల్డర్స్ అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దీన్ని పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని సుప్రీంకోర్టు సూచించింది.

కేంద్రం రూపొందించే నిబంధనల వల్ల వాక్‌స్వాతంత్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ వంటి ప్రాథమిక హక్కులకు భంగం కలుగకుండా.. ఆర్టికల్ 19(4)కు లోబడి ప్రభావవంతంగా పని చేసే నిబంధనలు రూపొందించాలని సోలిసిటర్ జనరల్ మెహతాకు చెప్పింది. ముసాయిదా నియంత్రణా నిబంధనలు రూపొందించి, పబ్లిక్ డొమైన్‌లో పెట్టే ముందు స్టేక్ హోల్డర్స్ అందరి సూచనలు తీసుకోవాలని.. ఆ తర్వాతే శాసన లేదా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ ప్రక్రియ పరిధిని విస్తరించడానికి కూడా తాము అనుకూలంగానే ఉన్నట్లు సుప్రీంకోర్టు చెప్పింది. కాగా, భారతీయ సమాజంలోని నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రసారం అవుతున్న కార్యక్రమాలను అడ్డుకోవాలని ఎస్జీ మెహతా సుప్రీంకోర్టులో వాదించారు. నైతికతకు సంబంధించి మన దేశంలో ఉండే నిబంధనలు.. ఇతర దేశాల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. అమెరికా వారి జాతీయ జెండాను దగ్దం చేయడం వారి ప్రాథమిక హక్కు. కానీ మన దేశంలో జాతీయ జెండాను కాల్చడం నేరమని మెహతా గుర్తు చేశారు.

కొన్ని సమాజాల్లో కొన్ని కఠినమైన నిబంధనలు ఉంటాయి. వాటి విషయంలో మేము ఉదారంగా ఉంటామని సుప్రీంకోర్టు చెప్పింది. హాస్యం అంటే కుటుంబం మొత్తం కలిసి ఎంజాయ్ చేసేలా ఉండాలి. అసభ్యకరమైన భాష ఉపయోగించడం హాస్యం కాదని మెహతా చెప్పారు. మనకు బాలీవుడ్‌లో, బయట ఎంతో అద్భుతమైన కమేడియన్లు ఉన్నారు. వారు చక్కని హాస్యాన్ని రచించగలరు. హాస్యం అనేది సృజనాత్మకతకు సంబంధించిన విషయమం అని మెహతా పేర్కొన్నారు. హాస్యానికి సంబంధించి కొంత నియంత్రణ ఉండాలి. కానీ ఇది సెన్సార్‌షిప్‌కు దారి తీయకూడదని సుప్రీంకోర్టు చెప్పింది.

అల్లాహ్‌బదియాకు ఊరట..

'ఇండియాస్ గాట్ లాటెంట్' షోలో రన్వీర్ అల్లాహ్‌బదియా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. కాగా, ఈ విషయంలో అల్లాహ్‌బదియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అల్లాహ్‌బదియా పాడ్‌కాస్ట్‌ను రద్దు చేయాలన్న ప్రాసిక్యూషన్ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ కార్యాక్రమాన్ని తిరిగి పునఃప్రారంభించేందుకు అతనికి అనుమతి ఇచ్చింది. అయితే అసభ్య పదాలం ఉపయోగించడం హాస్యం కాదని మందలించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అరెస్టు నుంచి రక్షణను పొడిగించింది. గౌహతీలో కూడా నమోదైన కేసులో దర్యాప్తుకు హాజరు కావాలని ఆదేశించింది.

Next Story