NEET UG : 29వ ప్రశ్నకు సమాధానం ఏమిటి?.. నిపుణుల కమిటీకి ‘సుప్రీం’ టాస్క్

by Hajipasha |
NEET UG : 29వ ప్రశ్నకు సమాధానం ఏమిటి?.. నిపుణుల కమిటీకి ‘సుప్రీం’ టాస్క్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఈ ఏడాది మే 5న జరిగిన ‘నీట్​ - యూజీ’ పరీక్ష ప్రశ్నాపత్రంలోని 29వ నంబరు ప్రశ్నకు సరైన సమాధానం ఏది ? అనే అంశంపై సోమవారం సుప్రీంకోర్టులో ఆసక్తికర విచారణ జరిగింది. ఆ ప్రశ్నకు సంబంధించిన రెండు ఆప్షన్లకు మార్కులను కేటాయించారంటూ కొందరు విద్యార్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్​టీఏ)కి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. 29వ నంబరు ప్రశ్నకు మార్కులు ఇచ్చినా, ఇవ్వకపోయినా మెరిట్‌ లిస్టు మారే అవకాశం ఉందని వారు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ‘‘ఒక ప్రశ్నకు ఒక సమాధానమే ఉంటుంది. రెండో సమాధానం అనేదే ఉండదు. రెండో సమాధానానికి కూడా ఎన్‌టీఏ మార్కులు ఇవ్వడం సరికాదని పిటిషనర్లు వాదిస్తున్నారు. ఇలా చేయడం వల్ల తప్పు సమాధానం పెట్టిన వారికి నాలుగు మార్కులు వచ్చాయి. నెగెటివ్ మార్కుల భయంతో ఆ ప్రశ్నకు సమాధానం రాయని వారికి నష్టం కలిగిందని వాళ్లు అంటున్నారు’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని బెంచ్ పేర్కొంది.

ఎన్‌టీఏకు సుప్రీం సూటి ప్రశ్నలు..

‘‘ఇంతకీ ఒక ప్రశ్నకు సంబంధించిన రెండు ఆప్షన్లకు మార్కులు ఇవ్వాలని ఎన్‌టీఏ ఎందుకు నిర్ణయించింది ?’’ అని ఎన్‌టీఏ తరఫు న్యాయవాది, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ‘‘ఆ రెండు ఆప్షన్లు కూడా సమాధానంగా పరిగణించే స్వభావాన్ని కలిగి ఉన్నందువల్లే ఎన్‌టీఏ ఆ నిర్ణయం తీసుకుంది’’ అని ఆయన బదులిచ్చారు. ‘‘నీట్-యూజీ సిలబస్‌కు సంబంధించి విద్యార్థులు కొత్త పుస్తకాలను చదివి ఉంటే.. తప్పకుండా ఆప్షన్ 4ను సరైన సమాధానంగా ఎంపిక చేసి ఉండేవాళ్లు. దాదాపు 4.2 లక్షల మంది విద్యార్థులు ఆప్షన్ 2ను టిక్ చేశారు. రెండు సమాధానాలకు దగ్గరి పోలిక ఉండటంతో ఈ రెండు టిక్ చేసిన వారికి 4 మార్కులు ఇచ్చాం’’ అని తుషార్ మెహతా వివరించారు. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం 29వ నంబరు ప్రశ్నకు సరైన సమాధానాన్ని తేల్చేందుకు ముగ్గురు నిపుణులతో ఒపీనియన్​ కమిటీని ఏర్పాటు చేయాలని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్​ను ఆదేశించింది. సరైన సమాధానాన్ని మంగళవారం మధ్యాహ్నం 12 గంటల్లోగా తెలపాలని సూచించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

161 వాంగ్మూలాలు చెబుతున్నది అదే..

నీట్ యూజీ పేపర్​ లీక్​ హజారీబాగ్​, పట్నా నగరాలకే పరిమితమైందా ? దేశవ్యాప్తంగా విస్తరించిందా ? అనే దాన్ని పరిశీలించాల్సి ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ అంశంపై ఓ పిటిషనర్​ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘‘ఎన్​టీఏ ప్రకారం ఏప్రిల్​ 24న పేపర్లు బయటకు పంపితే, మే3న బ్యాంక్​లకు చేరాయి. దీనిని పరిశీలిస్తే ఏప్రిల్​ 24 నుంచి మే3 వరకు ప్రశ్నాపత్రాలు ప్రైవేట్​ వ్యక్తుల ఆధీనంలోనే ఉన్నాయి’’ అని కోర్టుకు తెలిపారు. పిటిషనర్ల పక్షాన న్యాయవాది నరేందర్ హుడా వాదనలు వినిపిస్తూ.. 161 వాంగ్మూలాలు పేపర్‌ లీక్‌ మే 3వ తేదీ కంటే ముందే జరిగిందని బలంగా చెబుతున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత బ్యాంకుల్లో ప్రశ్నపత్రాలను దాచడానికి ముందే.. అవి లీకై ఉండొచ్చని బిహార్‌ పోలీసుల నివేదికలో ప్రస్తావించారన్నారు.ఇదేదో ఐదారుగురు విద్యార్థుల కోసం చేసిన లీకేజీ కాదని కోర్టు దృష్టికి నరేందర్ హుడా తీసుకొచ్చారు. కచ్చితంగా ఓ గ్యాంగ్‌ ఎప్పటినుంచో ఈ పని చేస్తోందని తెలిపారు. సంజీవ్‌ ముఖియా, ఇతర కీలక నిందితులు అరెస్టు కాలేదనే విషయాన్ని గుర్తు చేశారు. ఒకచోట ప్రశ్నపత్రాన్ని రిక్షాలో కూడా తరలించారని ఆయన దేశ సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.

Advertisement

Next Story