లోక్‌సభ ఎన్నికలకు ముందే సీఏఏ అమలు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడి

by samatah |
లోక్‌సభ ఎన్నికలకు ముందే సీఏఏ అమలు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడి
X

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే లోక్‌సభ ఎన్నికలలోపు దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈ చట్టం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌లలో హింసను ఎదుర్కొని భారతదేశానికి వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడానికి మాత్రమేననని..ఎవరి పౌరసత్వాన్ని తీసివేయడానికి కాదని స్పష్టం చేశారు. కానీ కొందరు పని గట్టుకుని సీఏఏకు వ్యతిరేకంగా ముస్లింలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఢిల్లీలో నిర్వహించిన ఓ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. దేశంలో సీఏఏను అమలు చేస్తామన్న హామీని గత కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. ‘బీజేపీ ఆర్టికల్ 370 రద్దు చేసింది. కాబట్టి దేశ ప్రజలు బీజేపీకి 370 సీట్లు, ఎన్డీయేకు 400 సీట్లు కట్టబెడతారని ఆశిస్తున్నాం’ అని చెప్పారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వ మేనని అందులో ఎటువంటి సందేహమూ లేదన్నారు. కాంగ్రెస్, ఇతర విపక్షాలు మళ్లీ ప్రతిపక్ష బెంచీల్లోనే కూర్చుంటారని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల నాటికి ఎన్డీయేలో మరిన్ని పార్టీలు భాగస్వామ్యం కానున్నాయని చెప్పారు. 2024 ఎన్నికలు ఎన్డీయే, ఇండియా కూటమికి మధ్య జరిగే ఎన్నికలు కాదని అభివృద్ధికి, నినాదాలు ఇచ్చేవారికి మధ్య జరిగే ఎన్నికలు అని అభివర్ణించారు. కాగా, 2019 డిసెంబర్ 11న సీఏఏను పార్లమెంటులో ఆమోదించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed