7రోజుల్లో దేశవ్యాప్తంగా సీఏఏ అమలు: కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

by samatah |
7రోజుల్లో దేశవ్యాప్తంగా సీఏఏ అమలు: కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఏడు రోజుల్లో దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ అన్నారు. ఆదివారం పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ పరగణాస్ జిల్లాలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ‘అయోధ్యలో రామమందిరం ప్రారంభమైంది. రాబోయే ఏడు రోజుల్లో దేశ వ్యాప్తంగా సీఏఏ అమల్లోకి వస్తుంది. ఇది నా హామీ’ అని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోనే గాక దేశంలోని ప్రతి రాష్ట్రంలో సీఏఏ అమలు చేస్తామన్నారు. సీఏఏను ఏ శక్తి అడ్డుకోలేదని గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని కోరారు.

సీఏఏ అంటే?

పౌరసత్వ సవరణ చట్టాన్ని 2019 డిసెంబర్ 11న పార్లమెంటు ఆమోదించింది. ఇది బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి 2014 డిసెంబర్ లోపు భారతదేశానికి వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు క్రైస్తవులకు భారత పౌరసత్వం కల్పిస్తుంది. భారతీయ చట్టం ప్రకారం పౌరసత్వానికి మతాన్ని ఒక ప్రమాణంగా ఉపయోగించడం ఇదే మొదటి సారి. అయితే ఈ దేశాల నుంచి వచ్చిన ముస్లింలకు పౌరసత్వం కల్పించడంపై మాత్రం ఎటువంటి నిబంధనలు పొందుపర్చలేదు. దీంతో ఈ చట్టం పలు విమర్శలకు దారి తీసింది. సీఏఏకు వ్యతిరేకంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీగా నిరసనలు వెల్లువెత్తాయి. 2020 నుంచి హోం మంత్రిత్వ శాఖ సీఏఏ అమలుకు నిబంధనలను రూపొందిస్తోంది. మరోవైపు గత రెండేళ్లలో, పౌరసత్వ చట్టం కింద ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం మంజూరు చేయడానికి తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 30 మందికి పైగా జిల్లా మేజిస్ట్రేట్లు, హోం సెక్రటరీలకు కేంద్రం అధికారాలు ఇచ్చింది.

Advertisement

Next Story