Illegal arrest: ఓ వ్యక్తిని అక్రమంగా అరెస్టు చేసిన పోలీస్.. రూ.2లక్షల జరిమానా విధించిన కోర్టు

by vinod kumar |
Illegal arrest: ఓ వ్యక్తిని అక్రమంగా అరెస్టు చేసిన పోలీస్.. రూ.2లక్షల జరిమానా విధించిన కోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: అక్రమంగా అరెస్టు చేసిన వ్యక్తికి రూ.2 లక్షలు చెల్లించాలని మహారాష్ట్ర పోలీసు అధికారిని బాంబే హైకోర్టు (Bombay High court)లోని ఔరంగాబాద్ బెంచ్ ఆదేశించింది. అలాగే ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న మరో పోలీసు కానిస్టేబుల్‌ను అక్రమంగా నిర్బంధించిన అతని బావమరిదికి రూ.50 వేలు చెల్లించాలని తెలిపింది. ఈ ఏడాది జూన్ 27న హింగోలి (Higoli) సిటీ పోలీస్ స్టేషన్‌లో ఓ ఎఫ్ఐఆర్ దాఖలైంది. ఐటీ చట్టంలోని సెక్షన్లు 66-A, 66-B కింద పరువు నష్టం, అభ్యంతరకరమైన విషయాలను పంపడం వంటి ఆరోపణలపై కేసు నమోదు చేశారు. అనంతరం ఆ వ్యక్తిని ఆగస్టు 6వ తేదీన అరెస్ట్ చేశారు. అయితే తనపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, దానిని రద్దు చేయాలని ఓ వ్యక్తి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయమూర్తులు విభా కంకన్‌వాడి, ఎస్‌జి చపల్‌గావ్‌కర్ లతో కూడిన బెంచ్ దీనిపై విచారణ చేపట్టింది. పిటిషనర్‌ను అరెస్టు చేయడానికి దర్యాప్తు అధికారి ఎటువంటి కారణాన్ని అందించలేదని, ఏడేళ్ల కంటే తక్కువ జైలు శిక్ష విధించే ఆరోపణలపై ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు ఇది తప్పనిసరి అని బెంచ్ పేర్కొంది. అరెస్టుకు గల కారణాలను సైతం అతనికి తెలియజేయలేదని గుర్తించింది. ఈ క్రమంలోనే పిటిషనర్‌కు రూ.2 లక్షల నష్టపరిహారం చెల్లించాలని పోలీస్ ఆఫీసర్‌ను ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed