IAF: తూర్పు లడఖ్ పరిస్థితులపై ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆందోళన..!

by Shamantha N |
IAF: తూర్పు లడఖ్ పరిస్థితులపై ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆందోళన..!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎల్ఓసీ వెంబడి చైనా మౌలిక వసతులు, నిర్మాణాలు చేపడుతోందని ఎయిర్ ఫోర్స్ చీఫ్, ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. భారత్‌ కూడా అదే స్థాయిలో వేగంగా సరిహద్దుల వద్ద సౌకర్యాలను మెరుగుపరుస్తోందన్నారు. భద్రతా దళాలకు దేశీయ తయారీ ఆయుధ వ్యవస్థలు ఉండాలని అన్నారు. 2047 నాటికి భారత దళాల దగ్గర పూర్తిగా దేశీయ ఆయుధాలే ఉండాలని ఎయిర్‌ మార్షల్‌ సింగ్‌ సూచించారు. ఎయిర్‌ ఫోర్స్‌డే రానున్న సందర్భంగా ఆయన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు అంశాల గురించి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు జరుగుతున్నాయన్నారు. భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కోవాలంటే దేశీయ ఆయుధాలు ఉండటం ముఖ్యమన్నారు. ఇప్పటికే రష్యా నుంచి మూడు యూనిట్ల ఎస్‌-400 వ్యవస్థలు దిగుమతి అయ్యాయని.. వచ్చే ఏడాది మిగిలిన వాటిని కూడా అందజేస్తామని మాస్కో చెప్పినట్లు ఏపీ సింగ్‌ వెల్లడించారు.

తూర్పు లడఖ్ పరిస్థితి ఆందోళనకరం

ఇప్పటివరకు తూర్పు లడఖ్ లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఎయిర్ ఫోర్స్ చీఫ్‌ పేర్కొన్నారు. నయోమాలో సరికొత్త ఎయిర్‌ ఫీల్డ్‌లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. వాయుసేన సామర్థ్యాలను బలోపేతం చేయడమే కాకుండా సెంట్రల్ సెక్టార్ లో ఎయిర్ ఫీల్డ్ లను అప్ గ్రేడ్ చేస్తామన్నారు. ఇక 114 మల్టీరోల్‌ ఫైటర్‌ జెట్ల కొనుగోళ్లపై స్పందించారు. ‘‘మనం ఏ మార్గంలో కొనాలన్నది నిర్ణయించుకోవాల్సి ఉంది. ప్రస్తుతం మనం 114 విమానాల కోసం డీఏపీ-2020 అంశాన్ని చూస్తున్నాం. కానీ, వాటిని దేశీయంగా తయారుచేస్తే బాగుంటుందని భావిస్తున్నాం. వాయుసేన 2047 నాటికి పూర్తిగా దేశీయ ఆయుధాలతోనే ఉండాలి. మనవద్ద పెద్దసంఖ్యలో ఆకాశ్‌ క్షిపణులు ఉన్నాయి. ఏటా 24 విమానాలను ఉత్పత్తి చేయగలిగితే ఉత్తమం. దానికోసం ప్రైవేటు సంస్థలపై ఆధారపడాల్సి ఉంటుంది.’’ అని సింగ్‌ వెల్లడించారు.

Next Story

Most Viewed