Japan Airport: కత్తెర తెచ్చిన కష్టాలు.. 36 విమానాలు ఆలస్యం

by Shamantha N |
Japan Airport: కత్తెర తెచ్చిన కష్టాలు.. 36 విమానాలు ఆలస్యం
X

దిశ, నేషనల్ బ్యూరో: జపాన్ లో హక్కైడో ద్వీపంలోని న్యూచిటోస్ ఎయిర్ పోర్టులో శనివారం గందరగోళం జరిగింది. ఓ రిటైల్ స్టోర్ నుంచి కత్తెర కన్పించకపోయింది. ఆ విషయం ఎయిర్ పోర్టు అధికారుల దృష్టికి రావడంతో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఎయిర్‌పోర్టుకు వచ్చే ప్రయాణికుల భద్రతా తనిఖీలను ఆపి మరి.. కత్తెర కోసం రెండు గంటల పాటు వెతికారు. దీని కారణంగా 36 విమాన (Flights) సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. మరో 200కు పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. దీనిపై ఎయిర్‌పోర్టు అధికారులు స్పందించారు. భద్రతాపరమైన చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు జరిపామన్నారు. ఎవరైనా ఉగ్రవాది ఆ కత్తెరని ఆయుధంగా మార్చే అవకాశం ఉందన్నారు. అందుకే ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే, చివరకు ఆ కత్తెర కన్పించకుండా పోయిన స్టోర్ లోనే దొరికింది. ఆ స్టోర్ లో మేనేజ్ మెంట్ సిస్టమ్ సరిగ్గా లేక ఇలా జరిగిందని ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు.

ప్రయాణికులకు ఇబ్బందులు

ఈ ఘటన కారణంగా న్యూచిటోస్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానాలు ఆలస్యం కావడంతో గంటలతరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. కొందరైతే చేసేదేం లేక తిరిగెళ్లిపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే, దీనిపై దర్యాప్తు చేపట్టాలని జపాన్‌ రవాణా మంత్రిత్వశాఖ ఎయిర్‌పోర్టు అధికారులను ఆదేశించింది. 1988లో ప్రారంభించిన ఈ న్యూ చిటోస్‌ ఎయిర్‌పోర్ట్‌.. హక్కైడోలో అతిపెద్దది. జపాన్‌లోని అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఇది ఒకటి. ఇక్కడ భద్రతాపరమైన ప్రొటోకాల్స్‌ కఠినంగా ఉంటాయని దీనికి పేరుంది. 2022లో 15 మిలియన్ల మంది ప్రయాణికులను ఈ ఎయిర్ పోర్టు స్వాగతించింది. ఉత్తరజపాన్ లో కీలకమైన రవాణా గేట్ వే గా నిలిచింది.

Advertisement

Next Story

Most Viewed