PM Modi : హిందూ మైనారిటీలకు రక్షణ కల్పించండి.. యూనుస్‌కు ప్రధాని మోడీ పిలుపు

by Hajipasha |   ( Updated:2024-08-08 17:52:30.0  )
PM Modi : హిందూ మైనారిటీలకు రక్షణ కల్పించండి.. యూనుస్‌కు ప్రధాని మోడీ పిలుపు
X

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడిగా గురువారం రాత్రి ప్రమాణ స్వీకారం చేసిన నోబెల్ గ్రహీత మహ్మద్ యూనుస్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు. బంగ్లాదేశ్ పరిస్థితులు సాధ్యమైనంత త్వరగా సాధారణ స్థాయికి చేరుకునేలా, హిందూ మైనారిటీల పరిరక్షణ జరిగేలా పాలన జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు.ఇరుదేశాల ప్రజల కలల సాకారం కోసం బంగ్లాదేశ్‌తో కలిసి పనిచేసేందుకు భారత్ సదా సిద్దమేనని మోడీ తెలిపారు. శాంతి భద్రతలు, వికాసానికి సంబంధించి భారత్- బంగ్లాదేశ్‌ల ఉమ్మడి లక్ష్యాలను నెరవేర్చుకునే దిశగా అడుగులు పడతాయనే విశ్వాసం వ్యక్తంచేశారు. ఈమేరకు భారత ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.

మైనారిటీ వర్గంపై దాడులు.. తీవ్ర ఆందోళనగా ఉన్నాం : భారత విదేశాంగ శాఖ

బంగ్లాదేశ్‌లో మైనారిటీ వర్గం వారు లక్ష్యంగా జరుగుతున్న దాడులపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితిని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. ‘‘బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలు, ఇళ్లు, వ్యాపారాలు లక్ష్యంగా దాడులు, హత్యలు జరుగుతున్నాయనే వార్తలు కలచివేస్తున్నాయి. మహిళలపై హింస జరుగుతోందని తెలుస్తోంది. ఈ పరిణామాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి’’ అని జైస్వాల్ చెప్పుకొచ్చారు.

సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించండి : జర్మనీ రాయబారి ఫిలిప్

బంగ్లాదేశ్‌లో సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు సైన్యం సన్నాహాలు చేయాలని ఆ దేశంలోని జర్మనీ రాయబారి ఫిలిప్ యాకెర్ మ్యాన్ సూచించారు. తద్వారా బంగ్లాదేశ్ ప్రజల చేతిల్లోకి దేశ భవితవ్యం తిరిగి వెళ్లిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. స్థిరమైన, బలమైన ప్రభుత్వం ఏర్పడితే బంగ్లాదేశ్‌ వికాసానికి బాటలు పడతాయని చెప్పారు.

Advertisement

Next Story