Hezbollah: హిజ్బుల్లా కొత్త చీఫ్‌గా నయీం ఖాసీమ్.. ప్రకటించిన మిలిటెంట్ గ్రూప్

by vinod kumar |
Hezbollah: హిజ్బుల్లా కొత్త చీఫ్‌గా నయీం ఖాసీమ్.. ప్రకటించిన మిలిటెంట్ గ్రూప్
X

దిశ, నేషనల్ బ్యూరో: లెబనాన్‌కు చెందిన మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా (Hezbollah) కీలక నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థ కొత్త చీఫ్‌గా నయీం ఖాసీమ్‌(Naim Qassem)ను నియమించింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన హసన్​ నస్రల్లా(Hasan Nasrallah) వారసుడిగా ఖాసీమ్‌ బాధ్యతలు తీసుకోనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం ఖాసీమ్ హిజ్బుల్లాకు డిప్యూటీ చీఫ్‌గా ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాలకుపైగా అదే పదవిలో కొనసాగుతున్నాడు. నస్రల్లా మరణానంతరం మిలిటెంట్ సంస్థకు నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఎన్నికను హిజ్బుల్లా నిర్ణయాధికార సంస్థ ‘షురా’ కౌన్సిల్ ధ్రువీకరించింది. అయితే నయీమ్ కంటే ముందు నస్రల్లా బంధువు హషీమ్ సైఫిద్దీన్(Hasheem saifeeddhin) పేరు హిజ్బుల్లా చీఫ్ రేసులో ప్రధానంగా వినిపించింది. కానీ ఆయన కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించారు. ఈ క్రమంలోనే ఖాసీమ్‌ను చీఫ్‌గా నియమించినట్టు తెలుస్తోంది.

నయీం నేపథ్యం?

నయీం ఖాసీమ్1953లో లెబనాన్‌లోని కాఫర్ కిలా గ్రామంలో జన్మించారు.1970లో లెబనాన్‌లోని షియా అమల్ ఉద్యమంలో ఆయన భాగమయ్యాడు. అనంతరం 1980లో హిజ్బుల్లా మూమెంట్‌లో పాల్గొన్న ఖాసీమ్ ఆ సంస్థ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా ఉన్నారు. 1991లో హిజ్బుల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్ అయ్యాడు. అప్పటి నుంచి అదే బాధ్యతల్లో కొనసాగారు. ప్రస్తుతం ఆయనే హిజ్బుల్లాలో అత్యంత సీనియర్ నేతగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హిజ్బుల్లా అధినేతగా ఎన్నికయ్యారు.

Advertisement

Next Story