హిమాచల్ ప్రదేశ్‌లో భారీ హిమపాతం: 475 రోడ్లు మూసివేత

by samatah |
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ హిమపాతం: 475 రోడ్లు మూసివేత
X

దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ హిమపాతం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచు భారీగా కురుస్తుండటంతో 333 స్టేషన్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నీటి సరఫరాకు కూడా ఆటంకం కలుగుతోందని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. అంతేగాక రాష్ట్రంలోని ఐదు జాతీయ రహదారులు సహా 475 రోడ్లను అధికారులు మూసివేశారు. చంబాలో 56, కాంగ్రాలో 1, కిన్నౌర్‌లో 6, మండిలో 51, సిమ్లాలో 133 రోడ్లు మంచు కారణంగా బ్లాక్ అయ్యాయి. అంతకుముందు రోజు దాదాపు 6 జాతీయ రహదారులతో సహా కనీసం 566 రోడ్లు మూసివేశారు. ఎత్తైన ప్రాంతాల్లో హిమపాతం తర్వాత పలు విద్యుత్ స్టేషన్లలో అధికారులు మంచు తొలగింపు కార్యక్రమాలు చేపట్టారు. కాగా, ఇతర ఉత్తర భారత రాష్ట్రాలు పొగమంచుతో కమ్ముకోగా, హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం మంచు కురుస్తుండటం గమనార్హం.

4.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

రాష్ట్ర రాజధాని సిమ్లాలో సోమవారం ఉదయం 4.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. అత్యల్ప ఉష్ణోగ్రత కుకుమ్‌సేరి ప్రాంతంలో -4.9 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డైంది. మంగళవారం వరకు ఎత్తైన కొండల్లో మంచు కురుస్తుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.ఈ నేపథ్యంలోనే ప్రజలకు పోలీసులు పలు సూచనలు చేశారు. ప్రయాణాలు ప్రారంభించే ముందు వాతావరణ పరిస్థితులను అంచనా వేయాలని, అత్యవసరం అయితే మాత్రమే జర్నీ చేయాలని సూచించారు. కాగా, నూతన సంవత్సరం తర్వాత హిమాచల్ ప్రదేశ్‌కు పర్యాటకులు భారీగా తరలివస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed