హాథ్రస్‌ విషాదం : భోలే బాబా లెటర్ కలకలం.. ఎఫ్ఐఆర్‌‌లో సంచలనాలు

by Hajipasha |
హాథ్రస్‌ విషాదం : భోలే బాబా లెటర్ కలకలం.. ఎఫ్ఐఆర్‌‌లో సంచలనాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌‌లోని హాథ్రస్‌ జిల్లా ఫుల్‌రయీ గ్రామంలో భోలే బాబా (నారాయణ్ సాకార్ హరి) సత్సంగ్‌ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య 121కి చేరింది. వీరిలో ఆరుగురు ఇతర రాష్ట్రాల వారు ఉన్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ బుధవారం వెల్లడించారు. ఆరుగురు మృతుల్లో నలుగురు హర్యానవాసులు, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ నుంచి ఒక్కొక్కరు ఉన్నారని తెలిపారు. ఈ దుర్ఘటనపై విశ్రాంత హైకోర్టు జడ్జితో జ్యుడీషియల్‌ విచారణ జరిపిస్తామని యోగి ప్రకటించారు. ఈ న్యాయ విచారణ కమిటీలో విశ్రాంత న్యాయమూర్తులతో పాటు పోలీసు అధికారులు కూడా ఉంటారని చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరనేది గుర్తించడంతో పాటు ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకొనేలా నిబంధనలను రూపొందిస్తామని ముఖ్యమంతి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.

భోలే బాబా ఫొటోలు తీయనివ్వడు : ఎన్‌సీడబ్ల్యూ చీఫ్

హాథ్రస్ ఘటనలో చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉండటంతో జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) చీఫ్ రేఖాశర్మ సంఘటనా స్థలాన్ని బుధవారం సందర్శించారు. ఈ ఘటనకు కారకుడైన భోలే బాబాపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్నారు. ‘‘ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలకు హాజరైనప్పుడు భోలే బాబా ఫొటోలను తీసేందుకు అనుమతించేవాడు కాదు. సమావేశానికి వచ్చే వారి ఫోన్లను తీసుకున్న తర్వాతే లోపలికి పంపించేవారు’’ అని రేఖాశర్మ చెప్పారు. భోలే బాబా కార్యక్రమాలకు హాజరయ్యే వారిలో అత్యధికులు నిరక్షరాస్య మహిళలే ఉన్నారని, వారికి కౌన్సెలింగ్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

భోలే బాబా లెటర్..

సాధారణంగానైతే భోలే బాబా ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్ పురిలో ఉన్న తన ప్రధాన ఆశ్రమంలోనే ఉంటారు. ప్రస్తుతం ఆయన అక్కడ లేరని పోలీసులు గుర్తించారు. బుధవారం రాత్రి సమయానికి ఆశ్రమం చుట్టూ పెద్దసంఖ్యలో పోలీసులను మోహరించారు. ఈనేపథ్యంలో హాథ్రస్‌ దుర్ఘటనపై భోలే బాబా బుధవారం సాయంత్రం స్పందించారు. చనిపోయిన వారికి సంతాపం తెలుపుతూ ఆయన ఓ లేఖను విడుదల చేశారు. దురదృష్టవశాత్తూ ఆ ఘటన చోటుచేసుకుందన్నారు. ఈ ఘటన వెనుక సంఘ విద్రోహ శక్తుల హస్తం ఉండొచ్చని ఆరోపించారు. తాను ప్రవచన కార్యక్రమ వేదిక నుంచి వెళ్లిపోయిన చాలాసేపటి తర్వాతే తొక్కిసలాట జరిగిందని భోలే బాబా స్పష్టం చేశారు. గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు ఆయన చెప్పారు.

2.5 లక్షల మందికి.. 70 మంది పోలీసుల పహారా

ఫుల్‌రయీ గ్రామంలో భోలే బాబా సత్సంగ్‌ నిర్వహించిన వారిపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ముఖ్య సేవాదార్‌ దేవ్‌ప్రకాశ్‌ మధుకర్‌, ఇతర ఆర్గనైజర్ల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. బాబా పేరును ఇందులో చేర్చలేదని పోలీసులు తెలిపారు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. భోలే బాబా సత్సంగ్ కార్యక్రమానికి 80వేల మందే వస్తారని తొలుత నిర్వాహకులు అంచనా వేశారు. దానిపై స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో 70మంది పోలీసులను సమీప స్టేషన్ నుంచి పంపించారు. అకస్మాత్తుగా 2.5 లక్షల మంది భక్తులు వస్తారని నిర్వాహకులు కూడా అంచనా వేయలేకపోయారని ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించారు. తొక్కిసలాట జరిగిన టైంలో 40 మంది పోలీసులే విధుల్లో ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ‘‘దాదాపు 40 నిమిషాల పాటు ప్రసంగించిన అనంతరం భోలే బాబా వేదికపై నుంచి వెళ్లిపోతుండగా.. ఆయన పాదాలు తాకిన మట్టిన తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. ఆ మట్టిని తీసుకొని నుదుటిపై పెట్టుకునేందుకు ఉరుకులు పరుగులు పెట్టారు. ఈక్రమంలోనే తొక్కిసలాట జరిగి మరణాలు సంభవించాయి. రూ.2.5 లక్షల మంది జనం రాకపోకల కోసం ఒకే ఎంట్రీ పాయింట్, ఒకే ఎగ్జిట్ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. ఇది కూడా తొక్కిసలాటకు మరో ప్రధాన కారణం’’ అని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు ప్రస్తావించారు.

సుప్రీంకోర్టు, హైకోర్టులో పిల్‌

హాథ్రస్‌ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని, దీనిపై కఠిన మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్‌ అభ్యర్థించారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ గౌరవ్‌ ద్వివేది అనే న్యాయవాది అలహాబాద్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ ఘటనకు జిల్లా అధికారులదే పూర్తి బాధ్యత అని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ తేదీని ఇంకా నిర్ణయించలేదు.

మృతులకు పుతిన్ సంతాపం

హాథ్రస్ ఘటనపై రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ మేరకు సంతాప సందేశాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీకి ఆయన బుధవారం పంపారు. తొక్కిసలాటలో గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని పుతిన్ ఆకాంక్షించారు.

Next Story

Most Viewed