గ్రూప్-2 పరీక్ష వాయిదా! నిరుద్యోగుల ఆందోళనతో నిర్ణయం?

by Prasad Jukanti |   ( Updated:2024-07-06 07:21:04.0  )
గ్రూప్-2 పరీక్ష వాయిదా! నిరుద్యోగుల ఆందోళనతో నిర్ణయం?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో గ్రూప్-2 ఎగ్జామ్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు టీజీపీఎస్సీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. షెడ్యూల్ ప్రకారం జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఇది వరకే ఉత్తర్వులను సైతం జారీ చేసింది. అయితే డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షలు వెంటవెంటనే ఉండటంతో తాము రెండు పరీక్షలకు సన్నద్ధం కావడానికి వీలు పడటం లేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో డీఎస్సీ పరీక్షను సెప్టెంబర్‌లో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో గ్రూప్-2, డీఎస్సీ పరీక్షల్లో ఏదో ఒకదాన్ని వాయిదా వేయాలని భావిస్తుండగా గ్రూప్-2 పరీక్షనే వాయిదా వేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది.

సానుకూలంగా స్పందించిన సీఎం!

ఉద్యోగాల భర్తీ విషయంలో పలు డిమాండ్లను పరిష్కరించాలని నిన్న నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిన్న సాయంత్రం తన నివాసంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులకు మేలు జరిగేలా తమ ప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నామని చెప్పిన ముఖ్యమంత్రి.. అభ్యర్థుల డిమాండ్ మేరకు పరీక్ష వాయిదా అంశంపైనా చర్చించినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో గ్రూప్-2 పరీక్ష వాయిదాకు సీఎం సైతం సానుకూలంగా స్పందించారని.. ఈ రోజు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నదని తెలుస్తోంది.

Advertisement

Next Story