అయోధ్యకు వెళ్లినందుకు వేధింపులు!: కాంగ్రెస్‌కు రాధిక ఖేరా రాజీనామా

by Dishanational2 |
అయోధ్యకు వెళ్లినందుకు వేధింపులు!: కాంగ్రెస్‌కు రాధిక ఖేరా రాజీనామా
X

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ కార్యాలయంలో ఇటీవల స్థానిక నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రాధిక ఖేరా ఆదివారం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాశారు. ‘రామ్ లల్లా జన్మస్థలం అయోధ్య మనందరికీ ఎంతో పవిత్రమైన ప్రదేశం. అక్కడికి వెళ్లకుండా నేను ఉండలేక పోయా. కానీ అయోధ్య రామాలయాన్ని సందర్శించినందుకు పార్టీ నుంచి వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తుందని నా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు’ అని లేఖలో పేర్కొన్నారు. ‘22 సంవత్సరాలకు పైగా పార్టీ కోసం పని చేశాను. ఎన్ఎస్‌యూఐ నుంచి కాంగ్రెస్ మీడియా విభాగం వరకు పూర్తి నిజాయితీతో బాధ్యతలు చేపట్టాను. అయినప్పటికీ అయోధ్య రాముడికి మద్దతు ఇచ్చినందుకు. తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎంతో బాధతో కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకుంటున్నా’ అని తెలిపారు. ‘నేను ఆడపిల్లను.. నిరంతరం పోరాడగలను. ఇప్పుడు చేస్తున్నది కూడా అదే. దేశ ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడతా’ అని పేర్కొన్నారు. అంతేగాక ఛత్తీస్‌గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయంలో తనతో అనుచితంగా ప్రవర్తించారని, అక్కడ గదిలో బంధించారని ఆరోపించారు. దీనిపై త్వరలోనే మరిన్న విషయాలను వెల్లడిస్తానని తెలిపారు. కాగా, ఖేరా బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది.

Next Story

Most Viewed