Gunbattle: జమ్మూ కశ్మీర్‌లోని సోపోర్‌లో ఎన్‌కౌంటర్.. ఓ ఉగ్రవాది హతం

by vinod kumar |
Gunbattle: జమ్మూ కశ్మీర్‌లోని సోపోర్‌లో ఎన్‌కౌంటర్.. ఓ ఉగ్రవాది హతం
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్టు ఇండియన్ ఆర్మీ తెలిపింది. శనివారం తెల్లవారుజామున సోపోర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఇరు వైపుల నుంచి కాల్పులు జరగగా టెర్రరిస్టు మరణించాడు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. మరికొంత మంది ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే హతమైన ఉగ్రవాది ఏ సంస్థకు చెందినవారో అధికారులు వెల్లడించలేదు. ఘటనా స్థలంలో సోదాలు జరుపుతున్నట్టు జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. కాగా, జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఉగ్ర కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి. అంతకుముందు ఈ నెల 14న దోడా జిల్లాలో జరిగిన కాల్పుల్లో ఆర్మీ అధికారి మరణించారు. ఆ తర్వాత 10 రోజుల వ్యవధిలోనే రఫియాబాద్‌లో ఎన్‌కౌంటర్ జరిగగా..ఓ ఉగ్రవాదిని బలగాలు మట్టుబెట్టాయి.

Advertisement

Next Story