గాంధీజీ 'కన్నింగ్'.. రాహుల్ కాబోయే మహాత్ముడు.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్య

by Hajipasha |
గాంధీజీ కన్నింగ్.. రాహుల్ కాబోయే మహాత్ముడు.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్య
X

దిశ, నేషనల్ బ్యూరో : గుజరాత్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, స్టార్ క్యాంపెయినర్ ఇంద్రనీల్ రాజ్‌గురు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ ఒకింత 'కన్నింగ్' అని ఆయన కామెంట్ చేశారు. రాహుల్ గాంధీ కాబోయే మహాత్ముడు అని చెప్పారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో మే 1న జరిగిన ఎన్నికల ప్రచారంలో రాజ్‌గురు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రాహుల్ గాంధీ రాబోయే రోజుల్లో మరో మహాత్మాగాంధీ అవుతారు. గాంధీజీ మాత్రం ఒకింత 'కన్నింగ్'. రాహుల్ గాంధీ ముక్కుసూటి వ్యక్తి. నిష్కల్మష హృదయం కలిగిన నాయకుడు. రాహుల్ గాంధీయే కాబోయే దేశనేత. రాహుల్‌ను 'పప్పూ' అంటూ చిత్రీకరించిన వాళ్లే ఇప్పుడు ఆయనను దేశనేతగా అంగీకరిస్తున్నారు’’ అని రాజ్‌గురు చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. జాతిపిత మహాత్మాగాంధీని అవమానిస్తారా? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భరత్ బొఘర ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలను గుజరాత్ ప్రజలు క్షమించరని, ఎన్నికల ఫలితాల్లో ఆ ప్రభావం కాంగ్రెస్ పార్టీపై తప్పనిసరిగా ఉంటుందన్నారు. దానికి రాజ్‌గురు తిరిగి ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు.

చరిత్ర పుస్తకంలో ఉన్నదే చెప్పాను

బీజేపీ విమర్శలపై రాజ్‌గురు స్పందిస్తూ.. మహాత్మాగాంధీపై ఓ చరిత్ర పుస్తకంలో వాడిన పదాన్నే తాను వాడానని, కన్నింగ్ అంటే తెలివైనవాడనే (క్లవర్) అర్ధం ఉందని చెప్పారు. గాంధీజీపై తాను చాలా చారిత్రక పుస్తకాలు చదివానని, ఒక పుస్తకంలో 'కన్నింగ్' అనే ప్రస్తావన ఉందన్నారు. తాను ఏమీ సొంత పదాలు వాడలేదని స్పష్టం చేశారు. బ్రిటీష్ వారితో గాంధీజీ పోరాడినట్టే ఇవాళ బీజేపీపై పోరాడుతున్న ఒకే ఒకరు రాహుల్ గాంధీ అని, ఆ కారణంగానే తాను రాహుల్‌ను తదుపరి మహాత్ముడిగా అభివర్ణించానని తెలిపారు.

Advertisement

Next Story