ప్రాణాలకు తెగించి సముద్రంలో మునిగిపోతున్న యువకులను కాపాడిన ఎమ్మెల్యే

by Mahesh |
ప్రాణాలకు తెగించి సముద్రంలో మునిగిపోతున్న యువకులను కాపాడిన ఎమ్మెల్యే
X

దిశ, డైనమిక్ బ్యూరో: సముద్రంలో మునిగిపోతున్న యువకులను ఓ ఎమ్మెల్యే చాకచక్యంగా వ్యవహరించి రక్షించాడు. ముగ్గురు యువకులను కాపాడగా...దురదృష్టవశాత్తూ నాలుగో యువకుడు మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. గుజరాత్‌లోని రాజూలా నియోజకవర్గంలోని పట్వా గ్రామానికి సమీపంలో చోటుచేసుకుంది. కాల్పేశ్ షియాల్, విజయ్ గుజారియా, నికుల్ గుజారియా, జీవన్ గుజారియా అనే యువకులు బుధవారం మధ్యాహ్నం పట్వా గ్రామానికి సమీపంలో సముద్ర స్నానానికి వెళ్లారు. అయితే, వాతావరణంలో వచ్చిన మార్పులతో అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో యువకులు నీళ్లల్లో మునిగి పోవడం మొదలైంది. ఈ క్రమంలో భయపడిపోయి పెద్ద ఎత్తున ఆర్తనాదాలు చేస్తూ సహాయం కోసం వేడుకున్నారు. దీంతో స్థానికులు రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించారు.

అదే సమయంలో బీచ్‌లో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే సోలంకీ వారిని గమనించి పరిస్థితి అంచనా వేయకుండా దైర్యంగా రంగంలోకి దిగారు. మరో ఆలోచన లేకుండా బోటు సహాయంతో సముద్రంలోకి వెళ్లి...స్వయంగా నీటిలోకి దిగి ముగ్గురు యువకులను రక్షించి ఒడ్డుకు చేర్చారు. అయితే, జీవన్ గుజారియా మాత్రం సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం సాయంత్రం అతని మృతదేహం లభించింది. కాగా, హీరా సోలంకి గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజులా నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆలస్యం చేయకుండా ధైర్యసాహసాలు ప్రదర్శించి ముగ్గురి ప్రాణాలను కాపాడిన ఎమ్మెల్యే రియల్ హీరో అని కొనియాడుతున్నారు అక్కడి ప్రజలు.

Advertisement

Next Story