ఎన్నికల నగారా : అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై పరిమితులు ఇవీ..

by Hajipasha |
ఎన్నికల నగారా : అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై పరిమితులు ఇవీ..
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకే రోజున లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. నాలుగో విడతలో భాగంగా మే 13న ఏపీలోని 25, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. అదే రోజున ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల అవుతాయి. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో దేశవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది.

తెలంగాణ లోక్‌సభ పోల్స్, 1 అసెంబ్లీ బైపోల్ షెడ్యూల్‌

తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్‌ 18న ప్రారంభం అవుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్‌ 25. మే 13న పోలింగ్ జరుగుతుంది. జూన్‌ 4న ఎన్నికల ఫలితం వస్తుంది. రాష్ట్రంలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి మే 13న పోలింగ్ జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దాని ఫలితం కూడా జూన్ 4నే వచ్చేస్తుంది. లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్

ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ పోల్స్‌ నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదల అవుతుంది. ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు నామినేషన్లను సమర్పించవచ్చు. ఏప్రిల్ 26న నామినేషన్లను పరిశీలిస్తారు. ఏప్రిల్ 29న నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. మే 13న పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఫలితం వస్తుంది.

అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై పరిమితులు ఇవీ..

అరుణాచల్‌, గోవా, సిక్కిం మినహా అన్ని రాష్ట్రాలు, ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతాల్లో పార్లమెంటరీ స్థానాల అభ్యర్థులు గరిష్ఠంగా రూ.95 లక్షలు ఎన్నికల్లో ఖర్చు చేసుకోవచ్చని ఈసీ వెల్లడించింది. ఈ మూడు రాష్ట్రాలు, మిగతా కేంద్రపాలిత ప్రాంతాల అభ్యర్థులకు మాత్రం రూ.75లక్షల పరిమితిని విధించింది. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు రూ.40లక్షలు, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అభ్యర్థులు రూ.28లక్షలు ఖర్చు చేసుకోవచ్చని పేర్కొంది.

Advertisement

Next Story