OTT Platforms: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ప్రభుత్వం వార్నింగ్

by S Gopi |
OTT Platforms: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ప్రభుత్వం వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు కీలక హెచ్చరిక జారీ చేసింది. మాదకద్రవ్యాల వినియోగాన్ని, ముఖ్యంగా ప్రధాన పాత్రలు, ఇతర నటీనటుల ద్వారా తగిన డిస్‌క్లెయిమర్ లేదా వార్నింగ్ లేకుండా ప్రసారం చేయడాన్ని మంత్రిత్వ శాఖ సీరియస్‌గా తీసుకుంది. మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రమోట్ చేయడం లేదా గ్లామరైజ్ చేసే కంటెంట్ స్ట్రీమింగ్ పట్ల అవసరమైన జాగ్రత్తలు ఉండాలని వారిని కోరింది.

మాదక ద్రవ్యాల వినియోగాన్ని ప్రోత్సహించడంపై ఆందోళన..

కొన్ని ఓటీటీ కంటెంట్ పరోక్షంగా మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ రకమైన ప్రచారం వీక్షకులను, ముఖ్యంగా యువతను ప్రభావితం చేస్తోంది. దీన్ని నియంత్రించేందుకు ఓటీటీ కంటెంట్ రూపొందించడంలో తగిన శ్రద్ధ తీసుకోవాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు మాదకద్రవ్యాల వినియోగాన్ని గ్లామరైజ్ చేయడం లేదా దాన్ని ఫ్యాషన్ ధోరణిలో చూపించేలా చిత్రీకరించడం మానుకోవాలి. ఎలాంటి మాదకద్రవ్యాల వినియోగం అయినా వాటి హానికరమైన పరిణామాలను కూడా చెప్పాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనికోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు తప్పనిసరిగా మాదకద్రవ్యాల వినియోగం ఉన్న కంటెంట్‌లో ప్రజారోగ్య సూచనలను పొందుపరచాలి. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాలలో భాగంగా మాదకద్రవ్యాల ప్రతికూల ప్రభావాల గురించి కంటెంట్‌ను రూపొందించడం, ప్రచారం చేసేందుకు ప్రయత్నించాలని వెల్లడించింది. ఈ ఆదేశాలను పాటించని వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed