స్టడీ మెటీరియల్స్‌‌పై పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలకు కీలక ఆదేశాలు

by Hajipasha |
స్టడీ మెటీరియల్స్‌‌పై పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలకు కీలక ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : విద్యా బోధనలో భారతీయ భాషలకు పెద్దపీట వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలకు ముఖ్యమైన ఆర్డర్స్ జారీ చేసింది. వచ్చే మూడేళ్లలో ప్రతి కోర్సుకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను భారతీయ భాషల్లో డిజిటల్‌ రూపంలో విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌సీఈఆర్‌టీ, ఎన్‌ఐఓఎస్‌, ఇగ్నో వంటి రెగ్యులేటరీ సంస్థల ఆధీనంలోని అన్ని పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థల్లో ఈ నిబంధనను అమలు చేయాలని నిర్దేశించింది. రాష్ట్రాల్లోని పాఠశాలలు, యూనివర్సిటీల్లో దీన్ని అమలు చేసేలా యూజీసీ, ఏఐసీటీఈ, పాఠశాల విద్యా విభాగాలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. మాతృభాషలో చదువుకునే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. స్థానిక భాషల్లో విద్యా సంబంధ కంటెంట్‌ను సృష్టించడం ద్వారా బహుభాషా సంపదను పెంచొచ్చని.. తద్వారా 2047 నాటికి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చొచ్చని తెలిపింది. సొంత భాషలో చదువుకోవడం ద్వారా విద్యార్థికి భాషాపరమైన అవరోధం ఏర్పడదని, వినూత్నంగా ఆలోచించే సహజ స్వభావం అలవడుతుందని విద్యాశాఖ పేర్కొంది.

Advertisement

Next Story