ముంబైలో గోల్డ్ స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టు: భారీగా బంగారం స్వాధీనం

by samatah |
ముంబైలో గోల్డ్ స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టు: భారీగా బంగారం స్వాధీనం
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబైలో అక్రమంగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు చేధించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా బంగారాన్ని ఆఫ్రికా నుంచి జవేరీ బజార్‌లోని స్థానిక మార్కెట్‌కు తరలిస్తున్నారని అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో 9.31కిలోల బంగారం, 16.66కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.1.92కోట్ల ఇండియన్ కరెన్సీ, సుమారు 10.48కోట్ల విలువైన విదేశీ కరెన్సీ పట్టుకున్నారు. ఇద్దరు ఆఫ్రికన్ పౌరులతో సహా నలుగురిని అరెస్టు చేశారు. స్మగ్లింగ్ చేసిన బంగారాన్ని కరిగించడం, తదుపరి ప్రాసెసింగ్ కోసం ఇక్కడికి గోల్డ్ తీసుకొస్తున్నట్టు అధికారులు భావిస్తున్నారు. బంగారాన్ని సేకరించిన ఆఫ్రికన్ జాతీయులు సమీపంలోని హోటళ్లలో బస చేసినట్టు తెలిపారు. కాగా, గతంలోనూ డీఆర్ఐ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు.

Advertisement

Next Story