Gandhi Peace Prize: గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి పురస్కారం..

by Vinod kumar |
Gandhi Peace Prize: గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి పురస్కారం..
X

న్యూఢిల్లీ : గోరఖ్‌పూర్‌లోని గీతాప్రెస్‌‌కు గాంధీ శాంతి పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గాంధేయ పద్ధతుల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన కోసం చేసిన కృషికిగానూ గీతాప్రెస్‌ ప్రచురణ సంస్థను 2021 ఏడాదికిగానూ ఈ పురస్కారానికి ఎంపిక చేశామని కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది. ప్రధాని మోడీ సారథ్యంలోని జ్యూరీ ఈ పురస్కారానికి గీతా ప్రెస్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసిందని తెలిపింది. శాంతి, సామాజిక సామరస్యత అనే గాంధీజీ ఆశయాలను ప్రచారం చేయడంలో గీతాప్రెస్‌ చేసిన కృషిని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేసుకున్నారని సాంస్కృతిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

గీతాప్రెస్‌ స్థాపించి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పురస్కారానికి ఎంపిక కావడం ఆ సంస్థ కృషికి దక్కిన గుర్తింపు అని తెలిపింది. 1923లో ఆరంభమైన గీతాప్రెస్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రచురణ సంస్థల్లో ఒకటిగా విలసిల్లుతోంది. 14 భాషల్లో 41.7 కోట్లకు పైగా పుస్తకాలను ప్రచురించి రికార్డు నెలకొల్పింది. వీటిలో దాదాపు 16.21 కోట్ల భగవద్గీత పుస్తకాలే ఉండటం విశేషం. ఈ పురస్కారం కింద రూ.కోటి నగదుతో పాటు జ్ఞాపికను గాంధీ జయంతి సందర్భంగా ప్రదానం చేస్తారు. 2020, 2019 సంవత్సరాలకు కలిపి ఒకేసారి గతేడాది మార్చిలో గాంధీ శాంతి పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. 2020కిగానూ బంగ్లాదేశ్‌ తొలి అధ్యక్షుడు దివంగత షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ను.. 2019 ఏడాదికిగానూ ఒమన్‌ సుల్తాన్‌ దివంగత ఖబూస్‌ బిన్‌ సైద్‌కు పురస్కారాలు ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed