ఏకవ్యక్తి పాలనకు విముక్తి..ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్

by vinod kumar |
ఏకవ్యక్తి పాలనకు విముక్తి..ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇతర పార్టీల సహాయం లేకుండా కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ అన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉన్నందున మోడీ హామీ ముగిసిందని తెలిపారు. ఓటర్ల బలంతోనే ఈ మార్పు సాధ్యమైందని చెప్పారు. పూణెలో బుధవారం జరిగిన ఓ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘ లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. గత పదేళ్లలో ప్రభుత్వం ఒక వ్యక్తి చేతుల్లో బంధీ అయింది. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ నుంచి విముక్తి లభించింది. ఈసారి ఇతరుల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు’ అని అన్నారు. నితీశ్, చంద్రబాబుల సహకారం లేకుండా ప్రభుత్వం ఏర్పాటయ్యేదే కాదన్నారు. కాబట్టి మోడీ గ్యారంటీలకు కాలం చెల్లిందని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయని దీమా వ్యక్తం చేశారు. అప్పుడు రాష్ట్ర ప్రజల చేతుల్లో అధికారం ఉంటుందని, క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. మహా వికాస్ అఘాడీ కూటమికి ప్రజలు అండగా ఉన్నారని స్పష్టం చేశారు.

Advertisement

Next Story