త్వరలోనే మరో నలుగురు ఆప్ నేతల అరెస్ట్: ఢిల్లీ మంత్రి అతిశీ సంచలన వ్యాఖ్యలు

by samatah |
త్వరలోనే మరో నలుగురు ఆప్ నేతల అరెస్ట్: ఢిల్లీ మంత్రి అతిశీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఢిల్లీ మంత్రి అతిశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరకుంటే తనతో పాటు ఆప్ కీలక నేతలు సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాఠక్, రాఘవ్ చద్దాలను కూడా త్వరలోనే అరెస్టు చేస్తారని చెప్పారు. ఆప్ నేతలను బీజేపీ టార్గె్ట్ చేసిందని ఆరోపించారు. మంగళవారం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘బీజేపీలో చేరాలని మా సన్నిహితుల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారు. రాజకీయ జీవితాన్ని కాపాడుకోవాలని లేదంటే అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నారు’ అని చెప్పారు. మరికొద్ది రోజుల్లోనే తమ నివాసాలపై దాడులు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందే ఆప్ కీలక నేతలను త్వరలోనే అరెస్టు చేస్తారని స్పష్టం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రతి ఆప్ నేతను జైలులో పెట్టాలని మోడీ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.

‘సీఎం కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఆప్ కూలిపోతుందని బీజేపీ ఊహించింది. కానీ రాంలీలా మైదాన్‌లో ప్రతిపక్ష పార్టీలు చూపెట్టిన ఐక్యతను చూసి భయపడింది. అందుకే మరోసారి ఆప్ నేతలను లక్ష్యంగా చేసుకోవాలని భావిస్తోంది’ అని చెప్పారు. బీజేపీకి భయపడే ప్రసక్తే లేదని వెల్లడించారు. ఆప్ నేతలందరినీ జైలులో పెట్టినా తుది శ్వాస వరకు కేజ్రీవాల్‌కు అండగా ఉంటామని స్పష్టం చేశారు. కేజ్రీవాల్, సిసోడియా, సంజయ్ సింగ్, సత్యేందర్ జైన్ జైల్లో ఉన్నప్పటికీ ఆప్ బలంగా ఉందని బీజేపీకి ఇప్పటికే అర్థమైందని చెప్పారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలోనే అతిశీ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Advertisement

Next Story