తమిళనాడు క్వారీలో పేలుడు(వీడియో).. నలుగురి మృతి.. పలువురికి గాయాలు

by Disha Web Desk 17 |
తమిళనాడు క్వారీలో పేలుడు(వీడియో).. నలుగురి మృతి.. పలువురికి గాయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలోని కరియాపట్టి ప్రాంతంలోని క్వారీలో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి నలుగురు మృతి చెందగా, దాదాపు 10 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పేలుడుకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన గదిలో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.

క్వారీ అవియార్-కీజౌప్పిలి కుందూ రహదారికి సమీపంలో ఉంది. అక్కడ క్వారీలో ఉన్నటువంటి రాళ్లను పగలకొట్టడానికి పేలుడు పదార్థాలను ఒక గదిలో నిల్వచేసి పెట్టారు. ప్రమాదావశాత్తు పేలుడు జరగడంతో క్వారీకి దగ్గరగా ఉన్నటువంటి రెండు వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే పేలుడు ప్రకంపనల ప్రభావం 20 కిలోమీటర్ల వరకు కనిపించింది. పేలుడు ధాటికి అంతా చెల్లాచెదురుగా పడిపోయాయి. పేలుడు పదార్థాలు ఉండడంతో అగ్నిమాపక శాఖ అక్కడికి చేరుకోలేకపోయింది. రెస్క్యూ టీమ్‌లు మెల్లగా శిధిలాలను తొలగించి, పేలని పదార్థాల కోసం వెతుకుతున్నారు.

క్వారీలో పేలుడు ఘటనతో కారియాపట్టి హైవేపై స్థానికులు ఆందోళనకు దిగారు. చాలా కాలంగా ఈ క్వారీని మూసివేయాలని ఈ ప్రాంత స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నారు. పేలుళ్ల కారణంగా తమ నివాసాలు దెబ్బ తింటున్నాయని, తరుచూ ట్రక్కులు ప్రయాణిస్తూ, దుమ్ము, ధూళితో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు పలుమార్లు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత క్వారీని పూర్తిగా మూసివేయాలని వారు ఆందోళనకు దిగారు.

Next Story

Most Viewed