జూన్ 4 తర్వాత బీజేపీ నేతలు జైలుకే: ఢిల్లీ మంత్రి అతిశీ

by samatah |
జూన్ 4 తర్వాత బీజేపీ నేతలు జైలుకే: ఢిల్లీ మంత్రి అతిశీ
X

దిశ, నేషనల్ బ్యూరో: జూన్ 4 తర్వాత ఇండియా కూటమి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఆ తర్వాత ఎలక్టోరల్ బాండ్ల పథకంపై దర్యాప్తు ప్రారంభిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి అతిశీ తెలిపారు. ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న బీజేపీ నేతలతో పాటు ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులు కూడా జైలుకు వెళ్తారని అన్నారు. మంగళవారం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజలు బీజేపీని తరిమికొట్టాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అయిన ఎలక్టోరల్ బాండ్ స్కామ్‌పై త్వరలోనే దర్యాప్తు జరుగుతుందని స్పష్టం చేశారు. మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడంపై స్పందిస్తూ.. హైకోర్టును గౌరవిస్తున్నామని కానీ, కోర్టు నిర్ణయం విభేదిస్తున్నామని తెలిపారు. ఎందుకంటే మద్యం కుంభకోణం మొత్తం బీజేపీ రాజకీయ కుట్ర అని ఆరోపించారు. ఎన్నికల పోరాటంలో ఆప్‌ని ఓడించలేక ఈడీ, సీబీఐని ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. ఈ కేసు మొత్తం బలవంతంగా తీసుకున్న వాంగ్మూలాలపై ఆధారపడి ఉందని, ఆప్ నేతలకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇవ్వని వారిని ఎంతో హింసించి ఇచ్చేలా చేశారన్నారు. ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.



Next Story