Natwar Singh: కేంద్ర మాజీమంత్రి కున్వర్ నట్వర్ సింగ్ కన్నుమూత

by Shamantha N |
Natwar Singh: కేంద్ర మాజీమంత్రి కున్వర్ నట్వర్ సింగ్ కన్నుమూత
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర మాజీమంత్రి కున్వర్ నట్వర్ సింగ్ కన్నుమూశారు. గత పదిహేను రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 95 ఏళ్ల కున్వర్ సింగ్ శనివారం అర్ధరాత్రి గురుగ్రాంలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చనిపోయారు. ఆయనకు భార్య హేమీందర్ కుమారి సింగ్ మరియు కుమారుడు జగత్ సింగ్ ఉన్నారు. దౌత్యవేత్తగా, రాజకీయవేత్తగా, రచయితగా నట్వర్‌ సింగ్‌ (Natwar Singh)కు అపార అనుభవం ఉంది. ఆయనకు కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాలపాటు అనుబంధం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్రమంత్రులు, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.

ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ లో చేరిక

భరత్ పూర్ రాజకుటుంబంలో 1931లో నట్వర్ సింగ్ జన్మించారు. 1953లో 22 ఏళ్ల వయసులో ఇండియన్‌ ఫారిన్‌ సర్వీసెస్‌ లో చేరారు. బీజింగ్, లండన్, యూకే, పాకిస్థాన్ హైకమీషనర్ కార్యాలయాల్లో భారత్ తరఫున పనిచేశారు. 1984లో నట్వర్ సింగ్ ని పద్మ భూషణ్‌తో ప్రభుత్వం సత్కరించింది. ఆతర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసిన నట్వర్ సింగ్.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. భరత్ పూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. 1985లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వంలో ఉక్కు, బొగ్గు, గనులు, వ్యవసాయ శాఖల్లో సహాయమంత్రిగా పనిచేశారు. 1986లో విదేశాంగ శాఖ సహాయమంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత కొంత కాలం పాటు హస్తం పార్టీకి దూరంగా ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా

నట్వర్ సింగ్ 1998లో తిరిగి కాంగ్రెస్‌లో చేరి భరత్‌పూర్ నుంచి లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు. 2004లో కేంద్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాగానే అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆయనను విదేశాంగ మంత్రిగా నియమించారు. ఇరాక్ ‘ఆయిల్‌ ఫర్‌ ఫుడ్‌ ప్రోగ్రాం’ ఒప్పందంలో వ్యక్తిగత లబ్ధి పొందారన్న ఆరోపణలతో 18 నెలల్లోనే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత నట్వర్‌ సింగ్‌ కాంగ్రెస్‌ పార్టీకీ రాజీనామా చేశారు. అప్పటి నుంచి నట్వర్‌సింగ్‌ పలు సందర్భాల్లో సోనియా గాంధీ విధానాలపై విమర్శలు గుప్పించారు. ‘ది లెగసీ ఆఫ్‌ నెహ్రూ: ఏ మెమోరియల్‌ ట్రిబ్యూట్‌’, ‘మై చైనా డైరీ 1956-88’ పేరిట నట్వర్‌ సింగ్‌ ప్రముఖ రచనలు చేశారు. ‘వన్‌ లైఫ్‌ ఈజ్‌ నాట్‌ ఎనఫ్‌’ పేరిట ఆత్మకథ రాశారు. 2014లో ప్రచురించిన నట్వర్ సింగ్ ఆత్మకథలో భారత్- అమెరికా అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో మన్మోహన్ సింగ్ పాత్రను విమర్శించారు. కాంగ్రెస్ పై, పార్టీ నాయకత్వంపై విమర్శలు చేయడంతో పాటు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed