బిగ్ న్యూస్: జైలుకెళ్లేందుకు సిద్ధమవుతోన్న రాహుల్.. ఇవాళ మధ్యాహ్నం సంచలన ప్రకటన..?!

by Satheesh |   ( Updated:2023-03-25 07:10:21.0  )
బిగ్ న్యూస్: జైలుకెళ్లేందుకు సిద్ధమవుతోన్న రాహుల్.. ఇవాళ మధ్యాహ్నం సంచలన ప్రకటన..?!
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభ సభ్యుడిగా తనపై అనర్హత వేటు పడిన తర్వాత రాహుల్ గాంధీ తొలిసారి మీడియాతో మాట్లాడబోతున్నారు. శనివారం మధ్యాహ్నం 1 గంటకు ఆయన మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. దీంతో కోర్టు తీర్పు, లోక్ సభ సెక్రటరీ జనరల్ తీసుకున్న నిర్ణయంపై ఆయన రియాక్షన్ ఎలా ఉండబోతోందనేది ఆసక్తిని రేపుతోంది.

అనర్హత వేటు తర్వాత నిన్న ట్విట్టర్ వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ తాను దేశం స్వరాన్ని వినిపిస్తున్నానని, ఇందుకోసం ఏ త్యాగానికైనా సిద్ధం అన్నారు. మరో వైపు రాహుల్ గాంధీ విషయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై దేశంలోని విపక్షాలు ఏకతాటిపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో తనపై జైలు శిక్ష, అనర్హత వేటు తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తిని రేపుతోంది.

జైలు శిక్షే రాజకీయ అస్త్రం?:

తనపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జైలు శిక్షను అనుభవించేందుకే ఆయన సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. మాట్లాడే స్వేచ్ఛను హరిస్తున్నారని, నేరాలు, స్కాంలు చేసిన వారు స్వేచ్ఛగా బయట తిరుగుతుంటే ప్రశ్నించిన తనను జైలుకు పంపించారనే విషయాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లే వ్యూహంలో భాగంగా ఆయన జైలు శిక్షనే రాజకీయ అస్త్రంగా మార్చుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మోడీని విమర్శిస్తే జైలుకు పంపేలా కుట్రలు జరుగుతున్నాయని నినదించేలా ఆయన ప్రణాళికలు రచిస్తున్నారని ఇందులో భాగంగా జైలుకు వెళ్లిన తర్వాతే శిక్షకు సంబంధించి న్యాయపోరాటం చేయాలని యోచిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చజరుగుతోంది.

రాహుల్ పై వేటు.. సుప్రీంలో పిల్:

రాహుల్ గాంధీపై అనర్హత వేటు నేపథ్యంలో ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(3) ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కేరళలోని మలప్పురంకు చెందిన మురళీధరన్ అనే సామాజిక కార్యకర్త ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఏదైనా కేసులో దోషిగా తేలితే ఆటోమేటిక్‌గా సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించే సెక్షన్8(3) వల్ల రాజ్యాంగంలోని 14వ అధికరణను ఉల్లంఘించడమే అవుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ కేసులో సంబంధిత సభ్యునికి వ్యతిరేకంగా ఆరోపించబడిన నేరాల స్వభావం, తీవ్రతతో సంబంధం లేకుండానే అనర్హతను అమల్లోకి తీసుకువస్తోందని అభిప్రాయపడ్డారు. అందువల్ల సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమైన 'ఆటోమేటిక్' అనర్హతపై తగిన ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ కోరారు.

Advertisement

Next Story

Most Viewed