Jammu Kashmir Voting : జమ్ముకశ్మీర్ ఎన్నికల పరిశీలనకు విదేశీ దౌత్యవేత్తల బృందం

by Shamantha N |
Jammu Kashmir Voting : జమ్ముకశ్మీర్ ఎన్నికల పరిశీలనకు విదేశీ దౌత్యవేత్తల బృందం
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండోవిడత పోలింగ్‌ కొనసాగుతోంది. కాగా.. జమ్ములో ఎన్నికల పరిశీలనకు అత్యున్నత స్థాయి విదేశీ దౌత్యవేత్తల బృందం చేరుకుంది. ఎన్నికల ప్రక్రియ పరిశీలనలో భాగంగా శ్రీనగర్ లోని పోలింగ్ స్టేషన్ ను పరిశీలించారు. అమెరికా, మెక్సికో, గయానా, దక్షిణకొరియా, సోమాలియా, పనామా, సింగపూర్‌, నైజీరియా, స్పెయిన్‌, దక్షిణాఫ్రికా, నార్వే, టాంజానియా, రువాండ, అల్గేరియా, ఫిలిప్పీన్స్‌ సహా వివిధ దేశాల దౌత్యవేత్తలు జమ్ములో పర్యటిస్తున్నారు.

26 స్థానాలకు పోలింగ్

ఇకపోతే, ఆరు జిల్లాల్లోని 26 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా.. మొత్తం 239 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా గండేర్‌బల్, బడ్‌గామ్‌ స్థానాల్లో పోటీలో నిలవగా.. కాంగ్రెస్ నేత తారిఖ్‌ హమీద్‌ కర్రా సెంట్రల్ షాల్టెంగ్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. నౌషేరా స్థానంలో బీజేపీ జమ్ముకశ్మీర్ చీఫ్ రవీందర్‌ రైనా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీనగర్, బడ్‌గామ్, రాజౌరీ, పూంఛ్, గండేర్‌బల్, రియాసీ జిల్లాల్లోని 26 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. 3,502 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ కొనసాగుతోంది. ఈ విడతలో 25.78 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కాగా.. జమ్ముకశ్మీర్‌లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశలో 24 స్థానాలకు సెప్టెంబర్ 18న పోలింగ్ జరగగా, రెండో దశలో బుధవారం 26 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఆక్టోబర్ 1న మూడో దశలో 40 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Next Story

Most Viewed