BRS Working President KTR : హైడ్రా పేరుతో హైడ్రామాలు కాదు హైదరాబాద్ ను బాగు చేయండి..

by Sumithra |   ( Updated:2024-09-25 09:10:15.0  )
BRS Working President KTR : హైడ్రా పేరుతో హైడ్రామాలు కాదు హైదరాబాద్ ను బాగు చేయండి..
X

దిశ, కూకట్ పల్లి : హైదరాబాద్ నగరాన్ని మురికి నీటి రహిత నగరంగా మార్చేందుకు గత ప్రభుత్వంలో 4 వేల కోట్లతో మురికి నీటి శుద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో ఈ రోజు మాజీ మంత్రులు మహమూద్ అలి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, మర్రి రాజశేఖర్ రెడ్డి, కేపీ.వివేక్, కాలేరు యాదయ్య, ఎమ్మెల్సీ షంభిపూర్ రాజు, కార్పొరేటర్ లతో కలిసి నియోజకవర్గంలోని ఫతేనగర్, ఖాజాకుంట చెరువుల వద్ద నిర్మిస్తున్న ఎస్టీపీలను సందర్శించారు. అనంతరం కూకట్ పల్లిలోనీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దక్షిణ ఆసియాలోని వందశాతం మురుగునీటి శుద్ధి చేసిన నగరంగా హైదరాబాద్ ఉండాలనే ఉద్దేశ్యంతో 4 వేల కోట్లతో మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్టీపీల నిర్మాణంలో వేగం తగ్గిందని ఆరోపించారు.

మూసి సుందరీకరణను సీఎం రేవంత్ రెడ్డి పాకిస్థాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం జరుగుతుందని ఆయన అన్నారు. కొత్తగా మూసీని శుద్ధి చేయాల్సిన అవసరం లేదని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కట్టిన ఎస్టీపీలను వినియోగించుకుంటే సరిపోతుందని అన్నారు. 4 వేల కోట్లతో జీహెచ్ఎంసీ పరిధిలో 31 ఎస్టీపీలు నిర్మించామన్నారు. మూసి ప్రాజెక్ట్ పై ముఖ్యమంత్రి, మంత్రుల మాటలకు పొంతన లేదని అన్నారు. లక్ష 50 వేల కోట్లు, 70 వేల కోట్లు, 50 వేల కోట్లు అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మూసి శుద్ధి వెనుక ప్రభుత్వ అస్సలు ఉద్దేశం వేరే ఉందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూంలు కట్టకుంటే మూసి నిర్వాసితులకు ఎక్కడ నుంచి ఇచ్చే వారని అన్నారు. హైడ్రా కూల్చివేతల పై కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయం పేదలకు మరొక న్యాయమా అని ఆరోపించారు. సిటీ ఎమ్మెల్యేలతో చర్చించి హైడ్రా పై ఒక నిర్ణయానికి వస్తాం అన్నారు. పేదల పట్ల హైడ్రా ప్రతాపానికి వేదశ్రీ అనే బాలిక ఉదాహరణ అని అన్నారు.

పాఠ్య పుస్తకాలు తీసుకుంటా అన్న వినకుండా హైడ్రా అధికారులు కర్కశంగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రస్తుతం చేసే పనులను బీఆర్ఎస్ గతంలోనే చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తే చాలని సూచించారు. పబ్లిసిటీ స్టంట్ లతో రేవంత్ ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని నడపలేరు. గతంలో మొహరం, వినాయక చవితి, సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లు ఏవి జరిగినా బీఆర్ఎస్ కట్టుదిట్టమైన భద్రత కల్పించి ఎటువంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకున్నారన్నారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం పాపం జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను కూడా సమర్ధవంతంగా నిర్వహించలేక పోయిందని ఆరోపించారు. మూసి నిర్వాసితులకు ముందుగానే నష్టపరిహారం, డబుల్ బెడ్రూం ఇంటి తాళాలు అప్పగించి కూల్చి వేత్తలు చేపట్టాలని, లేని పక్షంలో మూసి వద్ద కూల్చివేతను బీఆర్ఎస్ పక్షాన అడ్డుకుంటామని హెచ్చరించారు.

చెరువులో ఎఫ్టీ ఎల్ లలో ఉన్న మంత్రులు, నాయకుల ఇండ్లు కూల్చిన తరువాతనే పేదల వద్దకు రావాలని కోరారు. కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ, కోర్టు హాలిడే ఉన్న రోజున, ఆదివారం తెల్లవారుజామున కూల్చివేతలు చేయడం ఎందని ప్రశ్నించారు. ఇంటి స్థలాలు రిజిస్ట్రేషన్ చేసింది ప్రభుత్వ అధికారులే, పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వ అధికారులే కదా ఇప్పుడు మీరెలా వచ్చి అక్రమం అంటూ కలుస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ న్యాయ విభాగం బాధితులకు అండగా ఉంటుంది. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10, 12 మధ్యలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. స్థానిక కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్ వాళ్ళే కాబట్టి వాళ్ళను సంప్రదించిన మీకు అండగా ఉంటామని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రభుత్వం హైడ్రా పేరుతో హైడ్రామాలు మాని ప్రభుత్వం హైదరాబాద్ ను అభివృద్ధి చేయాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed