- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుహలు కాదు.. ప్రకృతి రమణీయత!
అమెరికాలో జులై నెలలో ఎండలు బాగానే ఉన్నాయి. వేసవి సెలవులు కావడంతో భాను మాగులూరి మరో నలుగురు మిత్రులతో కలిసి వర్జీనియాలో మా అమ్మాయి అనిత మన్నవ ఇంటి నుంచి లూరే కేవ్స్ ను చూడటానికి బయలుదేరి వెళ్లాం. అక్కడికి చేరడానికి మాకు సుమారు గంటకు పైగా పట్టింది. రహదారులు మొత్తం ఎత్తుపల్లాలు, చుట్టూ కొండలు, వాటిపై నుంచి జాలువారుతున్న సన్నటి నీటిపాయలు, దారిపొడవునా పచ్చదనం.. దీంతో ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుంది. అమెరికాలో పర్యాటక ప్రాంతాలను బాగా అభివృద్ధి చేస్తారు. అవి పెద్దవా, చిన్నవా అనే తేడా లేకుండా వాటికో గుర్తింపు తీసుకువస్తారు. అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించి, సృజనాత్మక అనుభూతిని కలుగచేస్తారు. వాటికి అనుబంధంగా మాల్స్, మ్యూజియాలు ఏర్పాటుచేసి అనేకమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. వీటిపై వచ్చే ఆదాయంతోనే వాటిని అభివృద్ధి చేస్తారు. ఇక్కడ కార్లకు సంబంధించిన మ్యూజియం కూడా ఉంది. అతి పురాతమైన వాహనాలు ఇక్కడ ఉన్నాయి. దీంతో పాటు మరో మ్యూజియం కూడా ఉంది. ఈ గుహలు కనిపెట్టిన వారు వినియోగించిన వస్తువులు ఇక్కడ ఉన్నాయి.
ప్రకృతి ప్రేమికులను బాగా ఆకట్టుకునేలా కేవ్స్ పక్కనే ఒక కొలను, అందులో ఫౌంటేన్ ఏర్పాటుచేశారు. చుట్టుపక్కల ఎత్తైన కొండలు, పచ్చటి పరిసరాలు, ఎటువైపు చూసినా గ్రీన్ మ్యాట్ పరిచినట్లుగా ఆకుపచ్చ రంగులో సహజసిద్ధంగా దర్శనమిస్తుంటాయి. ఇక్కడ సీజన్ లతో పనిలేకుండా నిత్యం ఈ ప్రాంతం పర్యాటకులతో రద్దీగా ఉంటుంది. దీనికి తోడు పాఠశాలలకు సెలవులు కావడంతో పిల్లలతో కలిసి తల్లిదండ్రులు, ఇతర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున పర్యాటకులు తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. టికెట్ ఖరీదు 32 డాలర్లు. మన కరెన్సీలో దాదాపు 2,500. దీనికి తోడు పార్కింగ్ ఫీజు అదనం. మనకున్న పర్యాటక ప్రాంతాల గొప్పదనం మనకు కనిపించదు. బయట ప్రాంతాల్లో ఉన్న వాటిని చూసిన తర్వాతగాని మన పర్యాటక ప్రదేశాల విశిష్టత తెలుస్తుంది. మనదేశంలో అమెరికా కంటే గొప్ప గొప్ప పర్యాటక ప్రదేశాలు ఉన్నా, మన ప్రభుత్వాలు అంతగా పట్టించుకోవు.
తూర్పు అమెరికాలో లూరే కేవ్స్ అతిపెద్ద గుహలు. అమెరికాలో పర్యాటకులు అత్యధికంగా సందర్శించే ప్రదేశంగా లూరే కేవ్స్ ప్రసిద్ధిగాంచాయి. నేచురల్ ల్యాండ్ మార్క్ గా అక్కడి ప్రజలు భావిస్తారు. శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం లూరే కేవ్స్ 450 మిలియన్ సంవత్సరాల క్రితం ఉద్భవించాయి. కానీ వీటిని కనుగొన్నది మాత్రం ఆగష్టు 18వ తేదీ 1878. వర్జీనియా రాష్ట్రంలోని లూరే పట్టణానికి అపాలాచియన్ పర్వతాలకు పశ్చిమాన ఉన్న షెనాండో లోయలో ఈ గుహలు ఉన్నాయి. సముద్ర మట్టానికి 927 అడుగులు ఎత్తులో ఉన్నాయి. ఇవి వాషింగ్టన్ డీసీకి 100 మైళ్లు, వర్జీనియాకు 70 మైళ్ల దూరంలో ఉన్నాయి. వీటి మొత్తం పొడవు సుమారు 2 కి.మీలు ఉంటాయి. ఇవి 64 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. గుహల లోపల 12 డిగ్రీల ఉష్టోగ్రతలు ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఇవి చలికాలంలో కూడా తెరిచే ఉంటాయి. 1974లో అమెరికా ప్రభుత్వం వీటిని సహజసిద్ధంగా ఏర్పడిన పర్యాటక ప్రదేశంగా గుర్తించారు(నేచురల్ ల్యాండ్ మార్క్).
డ్రీమ్ లేక్
ఇందులో ఒకచోట బ్రిడ్జ్ సహజసిద్ధంగా ఏర్పడినట్లు కనిపిస్తుంది. మరోచోట గ్రీన్ లేక్ లా కనిపిస్తుంది. దీనిని డ్రీమ్ లేక్ అని అంటారు. 2500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న లురే కేవ్స్ లో డ్రీమ్ లేక్ అనేది అతిపెద్ద నీటి సరస్సు. ఈ సరస్సు లోతు 18 నుంచి 20 అంగుళాల మధ్య ఉంటుంది. పైకప్పుపై ఉన్న సుందర దృశ్యాలు యథాతథంగా క్రింద ఉన్న నీటిలో అద్దంలోలా ప్రతిబింబిస్తాయి. అవి చూపరులకు యథాతథంగా క్రింద కూడా ఉన్నట్లు భ్రమింపచేస్తాయి. నీటిలో ఏమాత్రం కదలిక ఉండదు. అది లోతు తక్కువగా ఉన్నా అందాలను ఆరబోస్తున్నట్లు ఉంటుంది. ఇక్కడి నీరు నీలిరంగులో ఉంటుంది. ప్రతి ఏడాది 5,6 లక్షల మంది పర్యాటకులు ఈ కేవ్స్ ను సందర్శిస్తుంటారు. భూమి ఉపరితలానికి 164 అడుగుల లోతులో ఈ గుహలు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల 80 అడుగుల ఎత్తులో ఉంటాయి. కొన్ని చోట్ల 7 అడుగుల ఎత్తులో మాత్రమే ఉంటాయి. ఒక ప్రాంతానికి కెతెడ్రేల్ అనే పేరు పెట్టారు. లోపల ఉన్న దృశ్యాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. కలల ప్రపంచంలోకి తీసుకువెళ్లి గొప్ప అనుభూతులు మిగులుస్తాయి.
యాంఫీ థియేటర్
గుహలోపల సహజసిద్ధంగా ఏర్పడిన ప్రకృతి అందాలతో పాటు సంగీతం కోసం పియానో లాంటి వాద్యాన్ని 1954లో ఏర్పాటు చేశారు. ఇది అత్యంత పెద్దది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. ఇక్కడి నుంచి వచ్చే సంగీత తరంగాలు 37 చోట్ల ప్రతిధ్వనిస్తాయి. ఇక్కడ ఫ్లాటోస్ గోస్ట్ 6 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇందులో లేక్ తరహాలో నీళ్లు ఉంటాయి. నీళ్లు నీలం రంగులో కనిపిస్తాయి. అందులో నాణేలను, కరెన్సీ నోట్లను వేస్తారు. దీనివల్ల వారి కోరికలు నెరవేరతాయని విశ్వాసం. ఆ కరెన్సీ ఇప్పటివరకు 1,180.368 మిలియన్ డాలర్ల విలువ వరకు ఉంటాయి. 1961 నుంచి ప్రతి పదేళ్లకోసారి వీటిని లెక్కిస్తారు.
డిస్కవరీ రూమ్
ఆండ్రూ, విలియం, బెంటింగ్ స్టెబిన్స్ తో పాటు క్వింట్ అనే బాలుడూ వేసవి కాలంలో ఆ ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు ఒక సింక్ హోల్ నుంచి చల్లటి గాలి రావడాన్ని గమనించారు. దీంతో ఆ చల్లగాలి ఎక్కడ నుంచి వస్తుందోనని ఆ ప్రాంతం మొత్తం అన్వేషించారు. అక్కడున్నటువంటి సింక్ హోల్ ను గుర్తించి ఆండ్రూ, క్వింట్ ఇద్దరూ ఒక తాడు సహాయంతో గుహలోకి దిగారు. అంత పెద్ద గుహను చూసి ఒక్కసారిగా వారు ఆశ్చర్యపోయారు. మరుసటి రోజు మరలా కొవొత్తులతో వచ్చి మొత్తం కలియతిరిగారు. అందులో నుంచి వస్తున్న చల్లగాలిని పైపుల ద్వారా వారి ఇంటికి ఏసీ లాగా ఏర్పాటుచేసుకున్నారు. ఇది ప్రపంచంలోనే మొదటి ఎయిర్ కండిషన్ గా గుర్తించారు. ఈ గుహల్లో పైకప్పు నుంచి నీటి చుక్కలు పడుతూ ఉంటాయి. వీటి నిర్మాణం కాల్షియం కార్బోనేట్ ద్రావణంతో మిశ్రమమై కార్బన్ డై యాక్సైడ్ విడుదల చేస్తాయి. వీటి ద్వారా స్పటిక రూపంలో స్థంభాల్లాగా ఏర్పడ్డాయి. అనేకచోట్ల మర్రిచెట్టు ఊడల రూపంలో దర్శనమిస్తాయి. ఇక్కడ కొత్త నిర్మాణం నిక్షేపాలు ప్రతి 120 సంవత్సరాలకు ఒక క్యూబిక్ అంగుళం చొప్పున పేరుకుపోతాయి.
భూగర్భంలోని రాతిపొరల మధ్య రాపిడి కారణంగా ఇవి ఏర్పడ్డాయి. నీరు, రసాయనాలు, ఖనిజాలు కలవడంతో గుహ లోపల పసుపు, గోధుమ మరియు ఎరుపు రంగులలో అత్యంత ఆకర్షణీయంగా సుందరంగా కనిపిస్తున్నాయి. ఫ్లోస్టోన్ డ్రేపరీలు గుహ అంతటా విస్తరించి ఉన్నాయి. ఇందులో సారాసెస్ గుడారం ఒకటి. ఇది 50 అడుగుల పొడవులో ఉంటుంది. ఇక్కడి వందలాది నీటి ప్రవాహాల బేసిన్లు ఉన్నాయి. వాటిలో కొన్ని 50 అడుగుల లోతు వరకు ఉన్నాయి. వాటిలోని నీటిలో కార్బోనేట్ ఉంటుంది. ఇది తరచూ కాంక్రీషన్లను ఏర్పరుస్తుంది. వీటిని ముత్యాలు, గుడ్లు, స్నో బాల్స్ అని పిలుస్తారు. గుహలో నీటి పరిమాణం వేర్వేరు సీజన్లలో వేర్వేరుగా ఉంటుంది. లురే కేవ్స్ లో ఉన్న గదుల కొలతలు, వాటి రూపురేఖలు సులభంగా చెప్పలేము. కానీ ఈ సుందర దృశ్యాలు చూసినప్పుడు పర్యాటకులు అమితానందాన్ని పొందుతారు. ఇక్కడున్నటువంటి ప్రకృతి సోయగాలు పర్యాటకులకు మధురానుభూతిని కలిగిస్తూ అబ్బురపరుస్తాయి. ఇవన్నీ మనస్సుకు హత్తుకు పోయే దృశ్యాలు. అత్యంత అద్భుతంగా ఉండే ఈ ప్రకృతి రమణీయత పికాసో చిత్రాలను గుర్తుచేస్తాయి.
- మన్నవ సుబ్బారావు
99497 77727