హిందూ నాయకుడి హత్యకు రూ. కోటి సుపారీ: గుజరాత్‌లో నిందితుడి అరెస్ట్

by samatah |
హిందూ నాయకుడి హత్యకు రూ. కోటి సుపారీ: గుజరాత్‌లో నిందితుడి అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఓ హిందూ నాయకుడిని హత్య చేసేందుకు కుట్ర పన్నిన నిందితుడిని గుజరాత్‌లోని సూరత్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను మదర్సాలలో బోధిస్తున్న ముస్లిం మత గురువు మౌల్విగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు పాకిస్థాన్‌కు చెందిన డోంగర్, నేపాల్‌కు చెందిన సెహ్నాజ్ అనే వ్యక్తులతో గత రెండేళ్లుగా పరిచయం పెంచుకున్నాడు. భారతదేశంలోని హిందూ సంస్థలు నిరంతరం మహ్మద్ ప్రవక్త పరువు తీస్తున్నాయని వారికి బోధించారు. వీరిని ప్రేరేపించి హిందూ నేతలను చంపందుకు రూ. కోటి ఆఫర్ కూడా చేశారు. దీనికి గాను పాకిస్థాన్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నించారు.

ఈ నేపథ్యంలో సూరత్ క్రైమ్ బ్రాంచ్‌కు ఈ కుట్రకు సంబంధించిన సమాచారం అందింది. దీంతో పక్కా ప్లాన్ మేరకు సూరత్‌లోని చౌక్ బజార్ ప్రాంతంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద ఉన్న సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని తనిఖీ చేయగా..పాకిస్తాన్, నేపాల్ వ్యక్తులతో మాట్లాడినట్టు గుర్తించారు. హిందూ సంఘాల నాయకులను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపారు. అంతేగాక నిందితుడు పాకిస్థాన్, వియత్నాం, ఇండోనేషియా, కజకిస్తాన్, లావోస్ వంటి వివిధ దేశాల కోడ్‌లతో కూడిన వాట్సాప్ నంబర్‌లను కలిగి ఉన్నవారితో కూడా సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. మౌల్వీపై 153 (A) (మతం, జాతిపై దూషణలు లేక దాడులకు పాల్పడడం), 467, 468, 471 (నకిలీ పత్రాలు, ఎలక్ట్రానిక్ రికార్డులు కలిగి ఉండటం)తో పాటు సెక్షన్ 120 (B) నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేశారు. అయితే ఏయే నేతలను టార్గెట్ చేశారనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు.

Advertisement

Next Story

Most Viewed