రువాండాలో కుండపోత వర్షం.. 100 మందికిపైగా మృతి

by Vinod kumar |
రువాండాలో కుండపోత వర్షం.. 100 మందికిపైగా మృతి
X

న్యూఢిల్లీ: పశ్చిమ, ఉత్తర రువాండలో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వరదలు సంభవించాయి. దీంతో 109 మంది మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని స్థానిక మీడియా చెబుతోంది. ‘రికార్డుల ప్రకారం.. ఇటీవలి కాలంలో అత్యధిక మరణాలకు కారణమైన జాతీయ విపత్తు ఇదే’ అని రువాండా బ్రాడ్‌కాస్టింగ్ ఏజెన్సీ పేర్కొంది. మరింత మంది బాధితుల కోసం అన్వేషణ జరుగుతోందని రువాండా పశ్చిమ ప్రావిన్స్ గవర్నర్ ఫ్రాంకోయిస్ హబిటెగెకో తెలిపారు. గతవారం ప్రాంరభమైన ఈ భారీ వర్షాల వల్ల వరదలు రావడమే కాకుండా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. రోడ్లు నాశనమయ్యాయి.

రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని రువాండా వాతావరణ శాఖ హెచ్చరించింది. చిత్తడి నేలలు, ఇతర ప్రమాదకరమైన ప్రాంతాల్లో నివసించేవారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని గతంలోనే ప్రభుత్వం కోరింది. పశ్చిమ, ఉత్తర ప్రావిన్స్‌లతో పాటు రాజధాని కిగాలీలో ముఖ్యంగా కొండ ప్రాంతల్లో కొండచరియలు విరిగిపడే అవకాశముంది. ఉగాండా నైరుతి ప్రాంతంతో పాటు తూర్పు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్ష సూచన కనిపిస్తోంది. గత వారంలో ఉగాండాలోని మారుమూల జిల్లా రుకుంగిరిలో నది ఉధృతంగా ప్రవహించడంతో ఆ వరదల్లో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయారు.

Advertisement

Next Story