భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి

by Dishanational4 |
భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో : ఓ వైపు సార్వత్రిక ఎన్నికల హడావుడి ఉండగా.. మరోవైపు ఛత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్​ జరిగింది. శుక్రవారం ఉదయం మావోయిస్టుల కంచుకోటగా భావించే బీజాపుర్​ జిల్లా పెడియా పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగలూర్ ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో 12 మంది మావోయిస్టులు చనిపోయారు. భద్రతా బలగాలు నక్సల్​ ఏరివేత ఆపరేషన్​లో ఉండగా.. ఎదురుపడిన నక్సలైట్లు కాల్పులు జరిపారు. వారిని భద్రతా బలగాలు ప్రతిఘటించే క్రమంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుందని అధికార వర్గాలు వెల్లడించాయి. మావోయిస్టులు, పోలీసుల కాల్పులు, ప్రతికాల్పులతో గంగలూర్ అటవీ ప్రాంతం దద్దరిల్లిందని తెలిసింది. ఎన్​కౌంటర్​ స్థలం నుంచి పన్నెండు మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాలలో ఎవరికీ ఏమీ కాలేదని సమాచారం.

భద్రతా బలగాలను అభినందిస్తున్నా : సీఎం విష్ణు దేవ్ సాయి

ఈ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు హతమైన విషయాన్ని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ధృవీకరించారు. “నేను భద్రతా బలగాలను అభినందిస్తున్నాను. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నక్సలిజానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్నాం. నక్సలిజం త్వరగా అంతం కావాలని ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా కోరుకుంటున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల మేం ప్రయోజనం పొందుతున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు. గత నెల 16న ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు హతమయ్యారు. తాజాగా శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌ను కూడా కలుపుకుంటే..ఈ ఏడాది హతమైన మావోయిస్టుల సంఖ్య 103కు చేరింది. 2019 సంవత్సరం తర్వాత మావోయిస్టుల ఎన్‌కౌంటర్స్ మళ్లీ ఇప్పుడే అత్యధిక సంఖ్యలో జరిగాయి. భద్రతా బలగాలు 2018లో 112 మంది మావోయిస్టులను, 2016లో 134 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేశాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed