ఇండియాలోనే అత్యంత పొడవైన సొరంగ నిర్మాణాన్ని పరిశీలించిన నితిన్ గడ్కరీ

by Harish |   ( Updated:2023-04-10 17:11:02.0  )
ఇండియాలోనే అత్యంత పొడవైన సొరంగ నిర్మాణాన్ని పరిశీలించిన నితిన్ గడ్కరీ
X

శ్రీనగర్: భారత దేశ చరిత్రలోనే అత్యంత పొడవైన సొరంగ నిర్మాణం జరుగుతోంది. దీని పొడవు 13 కిలోమీటర్లు. ఆసియాలోనే ఇది అతి పొడవైన సొరంగంగా చెప్పవచ్చు. ఈ సొరంగం పేరు జోజిలా. దీన్ని కశ్మీర్‌లోని సోన్‌మార్గ్‌లో నిర్మిస్తున్నారు. కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం ఈ టన్నెల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సొరంగం చారిత్రాత్మకమైందని అన్నారు. కన్యాకుమారితో కాశ్మీర్ లోయను కనెక్ట్ చేసే ఆ టన్నెల్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని మంత్రి చెప్పారు.

ఈ సొరంగం నిర్మాణం విలువ రూ. 4,900 కోట్లు. ఇది 2026 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. చలికాలంలో శ్రీనగర్-లడఖ్ రహదారిని మూసేయడంతో ఆ ప్రాంత ప్రజలపై, సైన్యంపై తీవ్ర ప్రభావం చూపేది. అయితే 2020 జూన్ నుంచి భారత సైన్యం, చైనా మిలిటరీ మధ్య ప్రతిష్టంభన ఎదుర్కొంటున్న ఆ ప్రాంతానికి జోజిలా సొరంగం గేమ్-ఛేంజర్ అవుతుంది. జోజిలా పాస్‌ను దాటడానికి మూడు గంటల సమయం పడుతుంది. కానీ ఈ సొరంగం పూర్తయితే 20 నిమిషాల్లో వెళ్లిపోవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది.

గగన్‌గిర్‌ను సోనామార్గ్‌తో కలిపే జెడ్-మోర్ అనే మరో సొరంగం నిర్మాణాన్ని ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రారంభించనున్నట్టు మంత్రి ప్రకటించారు. ఇది సెంట్రల్ కశ్మీర్ గందర్‌బల్ జిల్లాలోని రిసార్ట్‌కు వెదర్ కనెక్టివిటీని అందిస్తుంది. ‘భారత దేశ చరిత్రలో ఇది చారిత్రాత్మకమైన, ముఖ్యమైన సొరంగం. ఇది ఆసియాలోనే అత్యంత పొడవైనది’ అని సొరంగం నిర్మాణ పనులను పరిశీలించిన తర్వాత మంత్రి అన్నారు. జమ్మూ-కశ్మీర్‌లో రూ. 25 వేల కోట్ల వ్యయంతో 19 సొరంగాలు నిర్మిస్తున్నారు. ప్రధానంగా నష్రీ, మనిహాల్ మధ్య కొండచరియలు విరిగిపడుతుంటాయి. దీంతో తరచుగా రహదారిని మూసేస్తుంటారు.

Advertisement

Next Story

Most Viewed