బర్డ్‌ ఫ్లూతో తొలి మరణం..ధ్రువీకరించిన డబ్ల్యూహెచ్ఓ

by vinod kumar |
బర్డ్‌ ఫ్లూతో తొలి మరణం..ధ్రువీకరించిన డబ్ల్యూహెచ్ఓ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలో బర్డ్ ఫ్లూతో తొలి వ్యక్తి మరణించారు. హెచ్5ఎన్2 అనే బర్డ్ ఫ్లూ వేరియంట్ వల్ల మెక్సికోలో ఒక వ్యక్తి మృతి చెందినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ధ్రువీకరించింది. 59 ఏళ్ల వ్యక్తి జ్వరం, శ్వాస ఆడకపోవడం, విరేచనాలు వంటి సమస్యలతో మెక్సికో నగరంలోని ఆస్పత్రిలో చేరాడని ఈ క్రమంలోనే ఏప్రిల్ 24న ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. బాధితుడు బర్డ్ ఫ్లూ బారిన పడ్డ విషయాన్ని మెక్సికో అధికారులు మే 23న డబ్లూహెచ్ఓకు తెలియజేసినట్టు పేర్కొంది. అయితే బాధితుడికి వ్యాధి ఎలా సోకిందనే దానిపై సమాచారం లేదని వెల్లడించింది. మరణించిన వ్యక్తితో సన్నిహితం ఉన్న వ్యక్తులను పరీక్షించినప్పటికీ వారిలో కేసులు కనుగొనబడలేదని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. మెక్సికోలోని పౌల్ట్రీలో హెచ్5ఎన్2 వైరస్‌లు వెలుగు చూశాయి. కోళ్ల నుంచి మనిషికి ఈ వ్యాధి ఎలా వ్యాపించిందో నిర్ధారించడం కష్టంగా మారిందని స్పష్టం చేసింది. మరోవైపు ఇప్పటివరకు ముగ్గురు డెయిరీ ఫామ్ కార్మికులకు సోకిన హెచ్ 5 ఎన్1 బర్డ్ ఫ్లూ అమెరికాలో వ్యాప్తి చెందడానికి ఈ కేసుకు సంబంధం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. మెక్సికో ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా దీని మూలాన్ని గుర్తించలేదని పేర్కొంది.

Advertisement

Next Story