'డ్రీమ్ గర్ల్ 2' రిలీజ్‌ను ఆపలేం : Bombay High Court

by Vinod kumar |
డ్రీమ్ గర్ల్ 2 రిలీజ్‌ను ఆపలేం : Bombay High Court
X

ముంబై : ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన మూవీ ‘డ్రీమ్ గర్ల్ 2’ విడుదలపై స్టే విధించేందుకు బాంబే హైకోర్టు నిరాకరించింది. శుక్రవారం రోజు రిలీజ్ కానున్న ఈ మూవీపై ఇప్పటికిప్పుడు స్టే ఆర్డర్స్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. రచయిత, దర్శకుడు ఆశిమ్ కుమార్ బాగ్చి దాఖలు చేసిన కమర్షియల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ దావాను విచారించిన బాంబే హైకోర్టు జడ్జి జస్టిస్ రియాజ్ చాగ్లా ఈమేరకు ఆదేశాలను జారీచేశారు. ‘డ్రీమ్ గర్ల్ 2’ సినిమాలో ఉన్న కథను తాను 2007లోనే ‘ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్’, ‘స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్‌’ లో.. “షో మస్ట్ గో ఆన్” పేరుతో రిజిస్టర్ చేసుకున్నానని ఆశిమ్ కుమార్ బాగ్చి వాదించారు.

సినిమా విడుదలపై మధ్యంతర నిషేధం విధించాలని కోర్టును కోరారు. అయితే ఈ పిటిషన్‌ను ఆగస్టు 18నే దాఖలు చేసినందున, ప్రతిస్పందించడానికి ప్రతివాదికి (బాలాజీ టెలిఫిలిమ్స్) తగిన సమయం ఇవ్వాలని జడ్జి జస్టిస్ రియాజ్ చాగ్లా అన్నారు. ఇప్పటికిప్పుడు సినిమాను ఆపేందుకు ఆర్డర్స్ ఇవ్వబోమని తేల్చి చెప్పారు. వారంలోగా తమ అఫిడవిట్‌లను దాఖలు చేయాలని ప్రతివాదులు బాలాజీ టెలిఫిల్మ్స్, ఏక్తా కపూర్, శోభా కపూర్, రాజ్ శాండిల్య, నరేష్ కథూరియాలను ఆదేశించారు. విచారణను ఆగస్టు 31కి వాయిదా వేశారు.

Advertisement

Next Story

Most Viewed