NCRB : దేశంలో గంటకు నాలుగు రేప్‌లు.. ఎన్‌సీఆర్‌బీ సంచలన నివేదిక

by Hajipasha |
NCRB : దేశంలో గంటకు నాలుగు రేప్‌లు.. ఎన్‌సీఆర్‌బీ సంచలన నివేదిక
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలో మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం వీటికి సంబంధించిన ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా కేంద్ర హోంశాఖకు చెందిన జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన నివేదికలో ఈ దారుణాలతో ముడిపడిన అధికారిక గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. వాటి ప్రకారం.. దేశంలో ప్రతి గంటకు సగటున నలుగురు లైంగిక దాడులకు గురవుతున్నారు. 2017 నుంచి 2022 సంవత్సరం మధ్యకాలంలో రోజుకు సగటున 86 రేప్‌ కేసులు నమోదయ్యాయి. అయితే ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. వాటిలో 82 కేసుల్లో రేపిస్టులు బాధిత మహిళలకు తెలిసిన వాళ్లే. 2017 నుంచి 2022 వరకు దేశంలో మొత్తం 1.89 లక్షల లైంగిక దాడుల కేసులు నమోదవగా, వాటిలో 1.91 లక్షల మంది మహిళలు బాధితులుగా ఉన్నారు. అత్యధికంగా 1.79 లక్షల కేసుల్లో తెలిసిన వాళ్లే మహిళలపై లైంగిక దాడులకు తెగబడ్డారు. ఈ కేసుల్లో నిందితులకు శిక్ష పడుతున్న కేసులు చాలా తక్కువగా ఉంటున్నాయని ఎన్‌సీఆర్‌బీ నివేదికలోనే ప్రస్తావించారు. 2014 నుంచి 2022 మధ్యకాలంలో నమోదైన మహిళలపై లైంగిక దాడుల కేసులకు సంబంధించిన నిందితుల్లో కేవలం 28 శాతం మందికే శిక్షలు పడ్డాయి.

అత్యధిక కేసులు రాజస్థాన్‌‌లో..

2022 సంవత్సరంలో మన దేశంలో మొత్తం 31,516 లైంగిక దాడి కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధిక కేసులు రాజస్థాన్‌ (5,399), మధ్యప్రదేశ్‌(3,029), మహారాష్ట్ర(2,904), యూపీ(3,690), ఢిల్లీ(1,212)లలో ఉన్నాయి. ఈ కేసులను ప్రతి లక్ష జనాభాకు విభజించి విశ్లేషిస్తే.. ఉత్తరాఖండ్‌లో అత్యధికంగా 15 లైంగిక దాడి కేసులు బయటపడ్డాయి. 2022 సంవత్సరంలో దేశంలో ప్రతి లక్ష జనాభాకు ఐదుగురు మహిళలు లైంగిక దాడులకు గురయ్యారు. ఇక పని ప్రదేశాల్లో రోజుకు సగటున ఒక మహిళ లైంగిక వేధింపుల బారినపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed