బీజేపీకి భయం పట్టుకుంది: కేజ్రీవాల్ అరెస్టుపై అఖిలేష్ యాదవ్

by samatah |
బీజేపీకి భయం పట్టుకుంది: కేజ్రీవాల్ అరెస్టుపై అఖిలేష్ యాదవ్
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీకి అధికారం కోల్పోతామనే భయం పట్టుకుందని, అందుకే దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షాలపై దాడులు చేయిస్తుందని సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శించారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసినందుకు బీజేపీ ప్రపంచ వ్యాప్తంగా అవమానాన్ని ఎదుర్కొంటుందని ఆరోపించారు. ఇండియా కూటమి ర్యాలీలో పాల్గొనేందుకు ఆయన ఆదివారం ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా అఖిలేష్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ చెప్పిన అబద్దాలు ప్రపంచంలో మరెవరూ చెప్పి ఉండబోరని తెలిపారు. ఎవరు అధికారంలోకి వస్తారో ఎవరు అధికారం కోల్పోతారో త్వరలోనే తెలుస్తుందని చెప్పారు. బీజేపీ వ్యతిరేకులపై ఈడీ, సీబీఐలను ఉసిగొల్పడమే తప్ప కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు.

కాగా, కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించే ‘సేవ్ డెమోక్రసీ’ ర్యాలీకి హాజరయ్యేందుకు ప్రతిపక్ష నాయకులు ఇప్పటికే రాంలీలా మైదాన్‌కు బయలు దేరారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే, తేజస్వీ యాదవ్‌లతో సహా ఇతర ఇండియా కూటమి నేతలు ర్యాలీకి అటెండ్ కానున్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సైతం హాజరుకానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ ర్యాలీని అవినీతిని దాచే ప్రయత్నమని బీజేపీ అభివర్ణించింది.

Advertisement

Next Story