రైతుల మార్చ్ షురూ: ట్రక్కులు, ట్రాక్టర్లతో ఢిల్లీకి బయలుదేరిన ఫార్మర్స్

by samatah |
రైతుల మార్చ్ షురూ: ట్రక్కులు, ట్రాక్టర్లతో ఢిల్లీకి బయలుదేరిన ఫార్మర్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్ర మంత్రులతో రైతుల చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాల నాయకులు మార్చ్ చేపట్టాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో పంజాబ్‌లోని ఫతేఘర్ సాహిబ్ నుంచి ట్రక్కులు, ట్రాక్టర్లతో రైతులు ఢిల్లీ వైపుగా బయలుదేరారు. దీంతో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ సరిహద్దులను పోలీసులు మూసివేశారు. హర్యానాలోని 7 జిల్లాల్లో ఇంటర్నెట్ నిలిపివేశారు. అంతేగాక సింఘు, తిక్రీ, ఘాజీపూర్ బార్డర్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు.. రోడ్డుపై మేకులను బిగించారు. కాగా, కనీస మద్దతు ధరకు చట్టం తీసుకురావడం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, రైతు రుణమాఫీ చేయాలని రైతు సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.

కిలోమీటరుకు గంట ప్రయాణం!

ఢిల్లీని ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాతో కలిపే ఘాజీపూర్, చిల్లా సరిహద్దు వద్ద జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. కార్లు రోడ్డుపై ఆగిపోయిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ రోడ్డుపై ఒక కిలోమీటరు వెళ్లేందుకు సుమారు గంట సమయం పడుతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీని గురుగ్రామ్‌తో కలిపే ఎన్‌హెచ్-48లోనూ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాజధానిలోకి ప్రవేశించే ముందు వాహనాలను తనిఖీ చేస్తుంటడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మరోవైపు, వేలాది మంది రైతులు భారీ నిరసన కోసం ఢిల్లీ వైపు మార్చ్ చేస్తుండగా, వారిని నిర్బంధించేందుకు స్టేడియంను తాత్కాలిక జైలుగా మార్చాలన్న కేంద్రం ప్రతిపాదనను ఆమ్ ఆద్మీ పార్టీ తిరస్కరించింది. డిమాండ్ల సాధనకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని పేర్కొంది.

Advertisement

Next Story