ఫడ్నవీస్ నా కుమారుడిని సీఎం చేస్తానన్నారు..ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు

by samatah |
ఫడ్నవీస్ నా కుమారుడిని సీఎం చేస్తానన్నారు..ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: శివసేన (యూబీటీ) చీఫ్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు ఆదిత్య థాక్రేని తదుపరి సీఎంగా చేస్తానని 2019 లో బీజేపీ నేత ఫడ్నవీస్ తనకు హామీ ఇచ్చారని వ్యాఖ్యానించారు. వచ్చే రెండు మూడేళ్లలో ఫడ్నవీస్ కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్తానని తనతో చెప్పినట్టు వెల్లడించారు. థారావిలో జరిగిన ర్యాలీలో ఉద్ధవ్ ప్రసంగించారు. ‘శివసేనతో పొత్తు కోసం అప్పటి బీజేపీ చీఫ్, ప్రస్తుతం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన నివాసం మాతోశ్రీకి వచ్చారు. అప్పుడు అధికారాన్ని పంచుకోవడం గురించి చర్చించాం. సీఎం పదవిని చెరో రెండున్నరేళ్ల పాటు చేపడతామని నాకు హామీ ఇచ్చారు. ఆథిత్య థాక్రేను సీఎం చేస్తానన్నారు. కానీ ఆ తర్వాత మోసం చేశారు’ అని ఆరోపించారు.

ఉద్ధవ్‌కు మతి భ్రమించింది: ఫడ్నవీస్

ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యలపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఉద్ధవ్‌కు మతి భ్రమించిందని ఫైర్ అయ్యారు. ‘ఉద్థవ్ థాక్రే చాలా భ్రమపడుతున్నారు. అమిత్ షా తనకు సీఎం పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్టు మొదట తెలిపారు. కానీ ఇప్పుడు తన కుమారుడిని సీఎం చేస్తానని చెప్పినట్టు చెబుతున్నారు. ఒక అబద్దాన్ని దాచి పెట్టేందుకు మరో అబద్ధం చెబుతున్నారు’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.‘బాలా సాహెబ్ థాక్రేను గౌరవిస్తున్నాం. ఎందుకంటే ఆయన మాటకు కట్టుబడి ఉంటాడు. అతని ఆదర్శాల నుంచి ఎంతో నేర్చుకున్నాం. కానీ బాలా సాహెబ్ ఆశయాలను విస్మరించే వారిని దూరంగానే ఉంచుతాం. స్క్రిప్టులు రాసి ఎవరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు’ అని ప్రశ్నించారు. సీఎం ఏక్‌నాథ్ షిండే కూడా థాక్రేపై విరుచుకుపడ్డారు. అబద్దాలు చెప్పడానికి కూడా ఓ పరిమితి ఉండాలని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story