Former army chief : భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ పద్మనాభన్ కన్నుమూత

by Shamantha N |
Former army chief : భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ పద్మనాభన్ కన్నుమూత
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత ఆర్మీ మాజీ చీఫ్ సుందర్ రాజన్ పద్మనాభన్ కన్నుమూశారు. 83 ఏళ్ల పద్మనాభన్ వృద్ధాప్య సంబంధ సమస్యలతో సోమవారం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. డిసెంబరు 5, 1940న కేరళలోని త్రివేండ్రంలో జన్మించిన జనరల్ పద్మనాభన్ 43 సంవత్సరాల పాటు ఆర్మీలో కొనసాగారు. సెప్టెంబరు 30, 2000 నుండి డిసెంబర్ 31, 2002 వరకు ఆర్మీ స్టాఫ్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆర్మీ 19వ చీఫ్‌గా పద్మనాభన్ పనిచేశారు. డెహ్రాడూన్‌లోని ప్రతిష్టాత్మక రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (RIMC), పూణేలోని ఖడక్‌వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA)లో విద్యను అభ్యసించారు. డిసెంబర్ 13, 1959 న ఇండియన్ మిలిటరీ అకాడమీ నుంచి పట్టభద్రుడయ్యాక ఆర్టిలరీ రెజిమెంట్‌లో నియమితులయ్యారు.

పలు పతకాలు

జనరల్ పద్మనాభన్ ఆర్మీ చీఫ్, ఇన్ స్ట్రక్టర్ సహా అనేక పదవులు నిర్వహించారు. పద్మనాభన్ ఆర్మీలో చేసిన సేవలకు ఆయనకు విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం సహా పలు అవార్డులు దక్కాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ (DGMI)కి పనిచేసిన తర్వాత.. జనరల్ పద్మనాభన్ ఉధంపూర్ లోని నార్తర్న్ కమాండ్ కు జీఓసీగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఆర్మీ స్టాఫ్ చీఫ్ గా పదోన్నతి పొందారు. జనరల్ పద్మనాభన్ 2002 డిసెంబర్ 31న పదవీ విరమణ చేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందించిన ఆయన భారత సైన్యంలో చెరగని ముద్ర వేశారు.

Advertisement

Next Story

Most Viewed